వారంలోగా లంకకు కొత్త అధ్యక్షుడు

వారంలోగా లంకకు కొత్త అధ్యక్షుడు

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను అంగీకరించినట్లు ఆ దేశ  స్పీకర్ మహింద యాప అభయవర్దెన ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను మొదలుపెడతామని  వెల్లడించారు.   వారంలోగా ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఇందులో భాగంగా రేపు (శనివారం) ఉదయం 10 గంటలకు పార్లమెంటును సమావేశపరుస్తామని చెప్పారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు.  కాగా,  ప్రజల ఆందోళన పెల్లుబికిన నేపథ్యంలో  గొటబాయ రాజపక్స జులై 13న శ్రీలంక నుంచి పరారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  సింగపూర్ లో ఉన్న ఆయన రాజీనామా లేఖను గురువారం ఈమెయిల్ ద్వారా స్పీకర్ కు పంపారు. 

కాబోయే అధ్యక్షుడు ఎవరు ? 

ప్రస్తుత పరిస్థితుల్లో రాజపక్స కుటుంబం ప్రాతినిధ్యం వహించే శ్రీలంక పొడుజన పెరమున(ఎస్ఎల్పీపీ)  పార్టీకి అధ్యక్ష రేసులో వెనుకంజ తప్పేలా లేదు. ఈ రేసులో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న వ్యక్తి పేరు సజిత్ ప్రేమదాస. ఆయన ప్రధాన  ప్రతిపక్షం ‘సమాగీ జన బలవేగయా’ (ఎస్జేబీ)కు చెందిన నాయకుడు. 2019లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. దీంతో 2019 జనవరి 3 నుంచి ఆయన శ్రీలంక ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. సజిత్ ప్రేమదాస లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో పీజీ చేశారు. ఒకవేళ అధ్యక్ష పదవి వరిస్తే.. ఆయనకున్న అనుభవంతో శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తారన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

పార్లమెంటులో బలాబలాలివీ.. 

శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 సీట్లు ఉన్నాయి. ఇందులో 103 సీట్లు మాత్రమే రాజపక్స కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలంక పొడుజన పెరమున(ఎస్ఎల్పీపీ) పార్టీకి ఉన్నాయి. సజిత్ ప్రేమదాస నేతృత్వంలోని ఎస్జేబీ పార్టీ కూటమికి 53 మంది ఎంపీల బలం ఉంది.  మరో 43 మంది స్వతంత్ర ఎంపీలు కలిసి ఒక చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చీలిక వర్గంతో చేతులు కలిపి అధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నాల్లో సజిత్ ప్రేమదాస ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. మొదటినుంచీ శ్రీలంకలోని తమిళ మైనారిటీలకు సజిత్ అండగా నిలుస్తున్నారు. ఈనేపథ్యంలో తమిళ్ నేషనల్ అలయన్స్ కు చెందిన 10 మంది ఎంపీలు కూడా సజిత్ కే మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధ్యక్ష ఎన్నికల రేసులో ఆయనకు లభించే ఓట్ల సంఖ్య 106 కు చేరే ఛాన్స్ ఉంది. అదే జరిగితే.. సజిత్ ప్రేమదాసకు అధ్యక్ష పీఠం దక్కడం నల్లేరు మీద నడకే అవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.