
వేములవాడ, వెలుగు: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. శ్రావణ మాసం, మూడో సోమవారం కావడంతో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ముందుగా కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో స్నానం ఆచరించారు.
అనంతరం కోడెల క్యూలైన్, ధర్మదర్శనం క్యూలైన్ మీదుగా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా స్వామి వారి దర్శనానికి సుమారు 5 గంటల టైం పట్టింది. అనంతరం కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసి లఘుదర్శనాన్ని అమలు చేశారు.