- సీతారామయ్యకు ముత్తంగి సేవ
- శ్రీరామపునర్వసు దీక్షలు షురూ
భద్రాచలం, వెలుగు : రామచంద్రుని జన్మనక్షత్రం పునర్వసు వేళ భక్తులు సోమవారం భద్రగిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తరామదాసు వారసుడు కంచర్ల శ్రీనివాసరావు, ఏఈవో శ్రావణ్కుమార్నేతృత్వంలో భక్తులు భద్రుని కొండ చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి ఆలయంలోకి ప్రవేశించారు. సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. అనంతరం ముత్యాలు పొదిగిన వస్త్రాలను మూలవరులకు అలంకరించి ముత్తంగి సేవను చేశారు.
లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామికి కూడా ముత్తంగి సేవ చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు. భద్రుని మండపంలో కార్తీక పునర్వసు సందర్భంగా శ్రీరామపునర్వసు దీక్షలను భక్తులు స్వీకరించారు. రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేశాక, అర్చకులు భక్తులకు రామమాలను అందజేశారు. కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం జరిగింది. భక్తులు కంకణాలు ధరించి క్రతువు నిర్వహించారు.
