బషీర్బాగ్, వెలుగు: శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్36వ వార్షికోత్సవాన్ని మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్ అధినేత, పద్మభూషణ్ కేఐ.వరప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. కూచిపూడి ద్వారా మన దేశ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు. కళాశ్రీ డాక్టర్ పి.రమాదేవి స్థాపించిన ఈ అకాడమీ క్రమశిక్షణతో అనేక మంది కళాకారులను తయారు చేస్తోందని ప్రశంసించారు.
రమాదేవి మాట్లాడుతూ.. అకాడమీ హైదరాబాద్, కేరళ, అమెరికా ఫిలడెల్ఫియా శాఖ ద్వారా తెలుగు నాట్య సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆమె శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. అనంతరం కళారంగానికి సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు
