ఫ్యూచర్ సిటీ లో హెల్త్ సిటీ.. మారుమూల ప్రాంతాలకు వైద్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఫ్యూచర్ సిటీ లో హెల్త్ సిటీ.. మారుమూల ప్రాంతాలకు వైద్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  •     ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్​గా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి: శ్రీధర్ బాబు
  •     కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్​తో మారుమూల ప్రాంతాలకు వైద్యం

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ‘హెల్త్ సిటీ’ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో మారుమూల ప్రాంతాలకూ వైద్య సౌకర్యాలను చేర్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని వివరించారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సోమవారం టీ హబ్ లో ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీఏఎల్ హాస్పిటల్స్ హెల్త్ ఫెస్ట్ 2026’ ఫైర్ సైడ్ చాట్ లో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 

రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైలింగ్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. మహిళలందరికీ ముందస్తు క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. అక్కడికొచ్చే రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందేలా టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. 

గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా తెలంగాణను మార్చాలనే సంకల్పంతో ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు. హెల్త్ కేర్ రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ ఆర్ అండ్ డీకి పెద్దపీట వేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత ‘తెలంగాణ డిజిటల్ ఎక్స్చేంజ్’ ను ప్రారంభించామని చెప్పారు. నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ను తయారు చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. 

మరో మూడు నుంచి నాలుగు నెలల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ ను లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ కు దీటుగా రాష్ట్రంలోని టైర్ 2, టైర్ 3 నగరాలను కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వరంగల్, ఆదిలాబాద్ లో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు సాయి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.