- మరో ఐదేండ్లలో 5లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్
- ఆస్‌బయోటెక్ 2025 సదస్సులో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: లైఫ్ సైన్సెస్ లో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్రంలో 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. 20 నెలల కాలంలో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ఇందులో లైఫ్ సైన్సెస్ రంగం వాటా రూ.63 వేల కోట్లు అని చెప్పారు. లైఫ్ సైన్సెస్ ఎగుమతులు గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలోనే రూ.26వేల కోట్ల మార్కును దాటాయన్నారు.
ప్రస్తుతం 80 బిలియన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే ‘‘కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’’ అందుబాటులోకి తెస్తామన్నారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్‌బయోటెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మెల్ బోర్న్ లో నిర్వహిస్తున్న ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో గురువారం ఆయన మాట్లాడారు.
ఫిబ్రవరిలో బయోఏషియా సదస్సు
తెలంగాణలో వివిధ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆస్ట్రేలియా కంపెనీలను శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సదస్సు ‘‘విక్టోరియా–తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్’’కు నాంది పలకాలని ఆకాంక్షించారు. రాబోయే ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను ఆహ్వానించారు. కార్యక్రమంలో విక్టోరియా రాష్ట్ర మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియర్సన్ ఎంపీ, ఆస్ బయోటెక్ చైర్మన్ జేమ్స్ క్యాంప్‌బెల్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
మా నినాదం ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’
ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ రూపొందించిన ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ కు చోటు దక్కిందని శ్రీధర్ బాబు అన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే అన్నారు. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు ఉండగా.. 2024లో ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగులకు చేరిందన్నారు. తమ నినాదం మేడిన్ ఇండియా కాదని, ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అని స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ‘ఎకో సిస్టం’ తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు.
