సురవరం ప్రతాప్ రెడ్డి ..బహుముఖ ప్రజ్ఞాశాలి

సురవరం ప్రతాప్ రెడ్డి ..బహుముఖ ప్రజ్ఞాశాలి
  • మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి
  • బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ భవనం, ఆడిటోరియం ప్రారంభం

బషీర్ బాగ్, వెలుగు:  తెలంగాణ సాహితీరంగంలో సురవరం ప్రతాప్ రెడ్డి పాత్ర గొప్పదని రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, ఎస్.నిరంజన్ రెడ్డి కొనియాడారు. పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, పరిశోధకుడిగా, సాహితీవేత్తగా, పండితుడిగా, కవిగా, రచయితగా, న్యాయవాదిగా, సంఘసంస్కర్తగా, ఎమ్మెల్యేగా, ఉద్యమకారుడిగా సురవరం ప్రతాప్ రెడ్డి బహుముఖ ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. బుధవారం బషీర్ బాగ్ లో ఆధునీకరించిన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ను, సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంను మంత్రులు ప్రారంభించి మాట్లాడారు. గోల్కొండ పత్రిక ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన మహనీయుడు సురవరం ప్రతాప్ రెడ్డి అని కొనియాడారు. తెలంగాణపై జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించారని గుర్తుచేశారు.  

కార్యక్రమానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించగా ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సమాచార శాఖ కమిషనర్ కె.అశోక్ రెడ్డి, మాజీ ఎంపీ, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సురవరం ప్రతాప్ రెడ్డి కుమారుడు కృష్ణవర్ధన్ రెడ్డి, హెచ్ఎండీఏ అధికారులు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఏపీ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు ఐవి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఐజేయూ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, సోమసుందర్,  హెచ్ యూజే అధ్యక్షుడు శిగ శంకర్  పాల్గొన్నారు.