ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ 16 గేట్లు ఓపెన్

ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ 16 గేట్లు ఓపెన్
  • లక్షా 50 వేల క్యూసెక్కుల వరద
  • 36.20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​ ఎగువ గోదావరి నుంచి లక్షా 50వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో బుధవారం16 గేట్లు ఎత్తి  52వేల 850క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. సాయంత్రానికి వరద నీరు లక్షా50 వేలకు తగ్గి, నీటిమట్టం 70.71 టీఎంసీలకు చేరి, నిలకడగా ఉంది. ప్రాజెక్ట్​కు పర్యాటకుల తాకిడి పెరగడంతో పోలీసులు అనుమతించారు.

కాలువలకు నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి భారీ ఎత్తున ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో ప్రధాన కెనాల్స్ ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ కు 5వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరికి 3వేలు,లక్ష్మీ కాలువకు 150 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. తాగునీటి కోసం మిషన్ భగీరథకు 231క్యూసెక్కులు,అవిరి రూపంలో 636 క్యూసెక్కులు వెళ్తోంది.

36.20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

శ్రీరాంసాగర్ కు వరద పోటెత్తుతోంది. దీంతో కాకతీయ కాలువకు 5వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3వేల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది.కాకతీయ, ఎస్కేప్ గేట్లకు నీటి సరఫరా చేయడంతో దిగువ జలవిద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతోందని జెన్ కో డీఈ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు టార్భాయిన్ల ద్వారా 36.20 మెగావాట్ల కరెంట్ జనరేట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సీజన్ లో 6.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని  వెల్లడించారు.