ఎస్సారెస్పీ 40 గేట్ల ఓపెన్.. రెండు లక్షలు దాటిన ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీ 40 గేట్ల ఓపెన్.. రెండు లక్షలు దాటిన ఇన్‌ఫ్లో

బాల్కొండ, వెలుగు : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరద ఉధృతి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో గరిష్ఠంగా 2 లక్షల 22 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. సోమవారం అర్ధరాత్రి వరకు 1,45,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఉదయం 6 గంటలకు 1,72,000 క్యూసెక్కులకు పెరిగింది. మధ్యాహ్నం 1,52,000 క్యూసెక్కులకు తగ్గినా, మళ్లీ 3 గంటలకు 1,62,000 క్యూసెక్కులకు చేరింది. అనంతరం ఎడతెరిపిలేని వర్షాల వల్ల సాయంత్రం 4 గంటలకు వరద తాకిడి 2,22,000 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి గోదావరిలోకి 3,35,160 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

రాత్రి వరకు మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1088.00 అడుగులు (69.85 టీఎంసీలు) నీరు నిల్వగా ఉందని ఏఈ కొత్త రవి వివరించారు. ప్రస్తుతం వరద కాలువకు 7,635 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5,500, ఎస్కేప్ గేట్లకు 2,500, సరస్వతీ కాలువకు 400, లక్ష్మీ కాలువకు 200, అలీసాగర్‌కు 180 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది.