ఎస్సారెస్పీకి వరద.. 8 గేట్లతో గోదావరికి నీటి విడుదల

ఎస్సారెస్పీకి వరద.. 8 గేట్లతో గోదావరికి నీటి విడుదల
  • 47929 క్యూసెక్కుల వరద
  • 8 గేట్లతో గోదావరికి నీటి విడుదల

బాల్కొండ, వెలుగు : ఎగువ గోదావరి నుంచి వచ్చిన వరదలతో శ్రీరాంసాగర్​ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. జూన్ ప్రారంభం నాటికి 12టీఎంసీల నీరు ఉండగా, జూలైలో ఆశించిన స్థాయిలో కొత్త నీరు వచ్చింది. జూన్ 1నుంచి సెప్టెంబర్ 9నాటికి ప్రాజెక్టుకు 372.35 టీఎంసీల నీరు వచ్చిందని ప్రాజెక్టు ఏఈ కొత్త రవి తెలిపారు. సెప్టెంబర్ 9 వరకు 304.63టీఎంసీల నీటిని బయటికి వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.  ప్రస్తుతం ఎగువ నుంచి 47929 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 8గేట్లతో గోదావరిలోకి 18384 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80.50 టీఎంసీలు కాగా, మంగళవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటి మట్టంతో జలకళను సంతరించుకుంది. 

ఎగువ నుంచి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు వరద గేట్లు, వివిధ ప్రధాన కాలువలకు నీటి విడుదల చేపట్టారు.కాకతీయ, ఎస్కేప్ గేట్ల ద్వారా నీటి విడుదల చేయడంతో ప్రాజెక్టు దిగువ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 22.41మిలియన్ యూనిట్ల కరెంట్ జనరేట్ చేసినట్లు జెన్ కో డీఈ శ్రీనివాస్ తెలిపారు. 

గడిచిన 24గంటల్లో 4 టార్భాయిన్ల ద్వారా 36.42 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. వరద కాలువకు 19వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 5500క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లకు 2500,సరస్వతీ కెనాల్ కు 800,లక్ష్మీ కెనాల్ కు 200,అలీసాగర్ 360, గుత్ప లిఫ్టు కు 270క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. మిషన్ భగీరథ కు 231క్యూసెక్కుల నీటి విడుదల చేస్తుండగా,684క్యూసెక్కుల నీరు అవిరిరూపంలో వెళ్తోంది.