శ్రీశైలం ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తారు

శ్రీశైలం ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తారు

వెలుగు, నెట్​ వర్క్: ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తారు. శనివారం ఏపీ మంత్రి అంబటి రాంబాబు మూడు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్​ పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201 టీఎంసీలకు చేరినట్లు అధికారులు చెప్పారు. ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలంలోకి 1,01,468 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా1,08,956 క్యూసెక్కుల ఔట్​ఫ్లో కొనసాగిస్తున్నారు. జూరాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి మరిన్ని గేట్లు ఎత్తే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆఫీసర్లు అంటున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జులై నెల‌‌లోనే శ్రీశైలం గేట్లు ఎత్తడం.. 12 ఏండ్లలో ఇది మూడోసారి.  

మంజీర పరవళ్లు..

ఎగువ నుంచి వస్తున్న వరదలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్​ ప్రాజెక్టులో నీరు 28.776 టీఎంసీలకు చేరింది. దీంతో మూడు గేట్లు ఎత్తి 34,890 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్ట్​ కెపాసిటీ 17.802 టీఎంసీలు కాగా.. 17.805 టీఎంసీల నీరు చేరింది. దీంతో 9 గేట్లు ఎత్తి 64,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నిజాంసాగర్​బ్యాక్​ వాటర్​తో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో 1400 ఎకరాల వరకు పంటలు నీట మునిగాయి. కరీంనగర్​లోని లోయర్ మానేరు డ్యామ్ కు శనివారం 40 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో అధికారులు ఉదయం 4 స్పిల్​వే గేట్లను, రాత్రి వరకు 20 వరద గేట్లను ఓపెన్​చేశారు. ఎగువన మోయతుమ్మెద వాగు, మిడ్​మానేర్​, వరద కాలువల నుంచి 32,772 క్యూసెక్కుల వరద వస్తోందని, 20 గేట్ల ద్వారా 37, 336 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు. ఎల్ఎండీ సామర్థ్యం 24 టీఎంసీలుండగా.. 21.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. ఖమ్మంలో భారీ వర్షాలకు పాలేరు జలాశయం నీటిమట్టం 25.6 అడుగులకు చేరింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. నిర్మల్​జిల్లా కడెం, గడ్డెన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సాత్నాల, తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కడెం ప్రాజెక్టులోకి 67,974 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో కొనసాగుతుండగా.. దిగువకు 49,085 క్యూసెక్కులు వదులుతున్నారు.

జంట జలాశయాల గేట్లూ..

ఉస్మాన్ సాగర్‌‌‌‌కు భారీగా వరద వస్తుండటంతో ఆరు గేట్లు ఓపెన్ చేశారు. ప్రస్తుతం 1,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 1,788 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నది. పూర్తి స్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం1,787.20 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1760.70 అడుగుల నీరు నిల్వ ఉంది. మరోవైపు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.69 మీటర్ల నీరు ఉంది.