సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటన..డాక్టర్ నమ్రతపై మరో కేసు

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటన..డాక్టర్ నమ్రతపై మరో కేసు

హైదరాబాద్:సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ ఫిర్యాదు చేయడంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతపై మరో కేసు నమోదు అయింది. 

గైనకాలజిస్ట్ ఫిర్యాదు..బాధిత గైనకాలజిస్ట్ తన లెటర్ హెడ్‌లను డాక్టర్ నమ్రత దుర్వినియోగం చేశారని గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నమ్రతతో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న డాక్టర్ నమ్రత, కళ్యాణి, సంతోషిలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారి పోలీస్ కస్టడీ ముగిసినప్పటికీ మరిన్ని వివరాలు రాబట్టేందుకు నమ్రతను మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని గోపాలపురం పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఐదు రోజుల కస్టడీలో పోలీసులు జరిపిన విచారణలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 86 మందికి సరోగసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా, గోపాలపురం పోలీసులు మూడు రిమాండ్ రిపోర్టులను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన రాష్ట్రంలో సరోగసీ ప్రక్రియపై అనేక అనుమానాలను, ప్రశ్నలను లేవనెత్తుతోంది. సరోగసీకి సంబంధించిన చట్టాలను ఉల్లంఘించారా, ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది.