
రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై విహరించనున్నారు. రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై ఊరేగనున్నారు . చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తెప్పపై దర్శనమివ్వనున్నారు. తెప్పోత్సవాలతో 13,14 న జరగాల్సిన వర్చువల్ అర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. మార్చి 17 తో తెప్పోత్సవాలు ముగియనున్నాయి. ఎన్నో ఏళ్ల నాటి నుంచి తిరుమలలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని చెబుతున్నారు టీటీడీ వేద పండితులు. శ్రీ సాళువ నరసింహ రాయలు ...1468 లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. తెప్పోత్సవాలపై శ్రీ తాళ్లపాక అన్నమయ్య తన సంకీర్తనల్లో ఎంతో గొప్పగా కీర్తించారు.