యుద్ధం వద్దంటూ లైవ్లో ఉద్యోగాలకు రాజీనామా

యుద్ధం వద్దంటూ లైవ్లో ఉద్యోగాలకు రాజీనామా

ఉక్రెయిన్ విషయంలో వ్లాదిమర్ పుతిన్ వైఖరిపై సొంత దేశంలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రష్యాకు చెందిన ఓ టీవీ ఛానల్ సిబ్బంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధ వార్తల్ని ప్రసారం చేసేందుకు రష్యా ప్రభుత్వం అక్కడి మీడియాకు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే రెయిన్ అనే టీవీ ఛానల్ మాత్రం ఆంక్షల్ని లెక్కచేయకుండా యుద్ధాన్ని ప్రపంచానికి చూపింది. దీంతో ప్రభుత్వం ఛానల్ ప్రసారాలు నిలిపేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సదరు ఛానల్ సిబ్బంది లైవ్లో ఉండగానే ఉద్యోగాలకు రాజీనామా చేసి స్టూడియో నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


తమ సిబ్బంది తీసుకున్న నిర్ణయానికి టీవీ ఛానల్ యాజమాన్యం సైతం మద్దతు తెలిపింది. యుద్ధం వద్దు అనే ప్రకటనను ప్రసారం చేసి తమ సిబ్బంది స్టూడియో నుంచి వాకౌట్ చేశారని టీవీ ఛానల్ ఫౌండర్లలో ఒకరైన నటాలియా సిండియేనవా ప్రకటించారు. ప్రభుత్వ ఆంక్షల కారణంగా ఎకో మాస్కో అనే రేడియో స్టేషన్కు సైతం రెయిన్ టీవీ ఛానల్ పరిస్థితే ఎదురైంది. యుద్ధ వార్తలను ప్రసారం చేయవద్దన్న రష్యా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సదరు రేడియో స్టేషన్ ప్రసారాలు నిలిపేసింది.