సిబ్బంది కొరతతో ఇబ్బంది..! - నిర్లక్ష్యానికి గురవుతున్న పబ్లిక్ హెల్త్ వరంగల్ రీజినల్ ల్యాబొరేటరీ

సిబ్బంది కొరతతో ఇబ్బంది..! - నిర్లక్ష్యానికి గురవుతున్న పబ్లిక్ హెల్త్ వరంగల్ రీజినల్ ల్యాబొరేటరీ
  • ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ఇక్కడికే శాంపిల్స్ 
  • 22 మందికిగానూ కేవలం ఐదుగురే విధుల్లో..
  • శాంపిల్స్ తేవాల్సింది.. టెస్టులు చేయాల్సింది వాళ్లే
  • సరిపడా స్టాఫ్ లేక నీటి నాణ్యత టెస్టులకు అడ్డంకులు
  • పనిభారంతో సిబ్బందికి తప్పని ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: ప్రజలు తాగే నీటి నాణ్యతను తేల్చేందుకు వరంగల్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ హెల్త్ రీజినల్ ల్యాబోరేటరీకి ఖాళీల జబ్బు పట్టుకుంది. ఫుడ్ పాయిజన్స్, డయేరియా, విష జ్వరాలు, ఇతర రోగాలు ప్రబలిన సమయంలో శాంపిల్స్ సేకరించి, టెస్టులు నిర్వహించేందుకు సరిపడా స్టాఫ్ లేక కూనారిల్లిపోతోంది. 

ప్రభుత్వం శాంక్షన్ చేసిన పోస్టుల్లో ముప్పావు వంతుకుపైగా ఖాళీగానే ఉండగా, అందుబాటులో ఉన్న అరకొర సిబ్బందే శాంపిల్స్ తీసుకురావడం నుంచి టెస్టులు చేసి, రిపోర్టులు కూడా తయారు చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతోనే క్షేత్రస్థాయిలో నీటి నాణ్యతా పరీక్షలు సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

16 జిల్లాలకు ఏకైక ల్యాబ్..

ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు వరంగల్ లోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ లో కొన్నేండ్ల కింద ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ రీజినల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసింది. గతంలో కరీంనగర్ లోనూ ల్యాబోరేటరీని ఏర్పాటు చేయగా, వివిధ కారణాలతో అదికాస్త మూతపడింది. అప్పటి నుంచి ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మంలోని 16 జిల్లాల బాధ్యతలను ఈ వరంగల్ రీజినల్ ల్యాబొరేటరీ చూసుకుంటోంది. ఈ మేరకు ఇక్కడి ల్యాబ్ సిబ్బంది ఆయా జిల్లాలను క్షేత్రస్థాయిలో విజిట్ చేసి బ్యాక్టీరియల్, కెమికల్ శాంపిల్స్ సేకరించి, టెస్టులు చేయాలి. 

పీహెచ్ వ్యాల్యూ, ఫ్లోరైడ్, కాల్షియం, నైట్రేట్, సీసం లాంటివి ఎంత మోతాదులో ఉన్నాయో గుర్తించి, తాగునీరు సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించాల్సి ఉంటుంది. ఫుడ్ పాయిజన్స్ జరిగిన సమయంలో ఆహారం, వ్యాధులు ప్రబలితే బ్లడ్ టెస్టులు కూడా చేసేలా ఏర్పాట్లు చేసింది. కానీ, కొంతకాలంగా ఫుడ్ శాంపిల్స్ టెస్ట్ నాచారంలోని ల్యాబ్ లో నిర్వహిస్తుండగా, వరంగల్ రీజినల్ ల్యాబ్ లో కేవలం వాటర్ టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. 

ముప్పావు వంతు ఖాళీలే..

కాలుష్య కారక పరిశ్రమలున్న ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కొత్త నీటి వనరులు వినియోగంలోకి తెచ్చిన సందర్భంలో అక్కడి వాటర్ క్వాలిటీని ల్యాబ్ సిబ్బంది టెస్ట్ చేయాలి. హాస్పిటళ్లు, ఫిల్టర్ బెడ్లు, వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలి. హాస్టళ్లు, స్కూళ్లు, ఇతర ప్రదేశాల్లో ఫుడ్ పాయిజన్స్, డయేరియా, టైఫాయిడ్ జర్వాలు ప్రబలినా అక్కడి శాంపిల్స్ పరీక్షించాలి. ఒకవేళ ఎక్కడైనా వాటర్ క్వాలిటీ సరిగా లేకుంటే వెంటనే సంబంధిత అధికారులను అలర్ట్ చేయాలి. 

కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండే సమస్యాత్మక గ్రామాల్లో నిరంతరం టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు వరంగల్ ల్యాబ్ కు అప్పట్లో ప్రభుత్వం 22 పోస్టులు మంజూరు చేసింది. కానీ, అందులో ముప్పావు వంతు ఖాళీలే ఉన్నాయి. ఇందులో కీలకమైన సివిల్ సర్జన్ బ్యాక్టీరియాలజిస్ట్ పోస్ట్ మంజూరైనా భర్తీ జరగలేదు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ముగ్గురు ఉండాల్సినప్పటికీ ఒక్కరు మాత్రమే పని చేస్తున్నారు. సీనియర్ అనలిస్ట్ స్థానం భర్తీ అయినప్పటికీ జూనియర్ అనలిస్ట్ పోస్టులు  మూడు ఖాళీగానే ఉన్నాయి. 

ల్యాబ్ అసిస్టెంట్ ఆరు పోస్టులకుగాను ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. శాంపిల్ టేకర్స్ ముగురు ఉండాల్సినప్పటికీ ఇద్దరు మాత్రమే ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీటికితోడు సీనియర్ అసిస్టెంట్, రెండు ల్యాబ్ అటెండెంట్, రెండు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇలా 22 పోస్టులకుగానూ 17 ఖాళీగా ఉండగా కేవలం ఐదుగురు మాత్రమే పని చేస్తున్నారు. దీంతో అందుబాటులో ఉన్న సిబ్బందే ఆఫీస్ తాళాలు తీయడం నుంచి శాంపిల్స్ సేకరించడం, పరీక్షించడం, వాటి రిపోర్టులు తయారు చేయడం వరకూ అన్ని పనులు చేసుకోవాల్సి
 వస్తోంది.


ఇరుకు గదిలో ఇబ్బందులు..

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీనంగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రతి నెలా ఐదారు వందలకుపైగా శాంపిల్స్ ఇక్కడి సిబ్బంది సేకరిస్తున్నారు. వాటిని ల్యాబ్ లో టెస్టులో చేసి, రిపోర్టులు కూడా తయారు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇంత పెద్ద మొత్తంలో శాంపిల్స్ టెస్ట్ చేయాల్సిన ల్యాబ్ ను కుడా బిల్డింగ్ లోని రెండు గదుల్లో ఏర్పాటు చేశారు. అవి కూడా ఇరుకుగానే ఉండగా ఒకదాంట్లో ఆఫీస్ సెక్షన్, మరోదాంట్లో ల్యాబ్ నడిపిస్తున్నారు. 

దీంతో టెస్టులతో పాటు ఆఫీస్ నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాలకు కీలకమైన వరంగల్ రీజినల్ ల్యాబొరేటరీకి ఇప్పటికైనా మోక్షం కల్పించాలని, సిబ్బందిని నియమించి మరింత బలోపేతం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి