రైతులపై పెట్టిన కేసులు ఎత్తేస్తున్నాం

రైతులపై పెట్టిన కేసులు ఎత్తేస్తున్నాం

చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. ఈ ఉదయం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి స్టాలిన్. తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మూజువాణి ఓటుతో తీర్మానాన్ని ఆమోదించింది అసెంబ్లీ. చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల చేసిన ఆందోళనలపై నమోదైన కేసులన్నింటిని ఎత్తివేస్తున్నట్టు స్టాలిన్ ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని స్టాలిన్ కోరారు. ఆ చట్టాల వల్ల రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేదని, వాటి రూపొందించిన తీరు కూడా ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని స్టాలిన్ అన్నారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కునేలా చట్టాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాల వల్ల రైతులకు కాకుండా కార్పొరేట్లకు మాత్రమే లాభం కలుగుతుందని స్టాలిన్ ఆరోపించారు. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చే విషయంలో ఈ చట్టాల్లో క్లారిటీ లేదని అన్నారు. తమ రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి రైతుల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ పెడతామని స్టాలిన్ తెలిపారు.