- ఎన్నికలకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి
- పార్టీ శ్రేణులకు తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ పిలుపు
తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే శ్రేణులకు ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.
చెన్నై: తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై మాజీ సీఎం స్టాలిన్సంచలన కామెంట్స్చేశారు. విజయ్ సర్కారు ఎప్పుడైనా కూలిపోవచ్చని.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సొంతంగా 107 సీట్లలో గెలుపొందిన టీవీకే పార్టీ.. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్తో పాటు 25 మంది అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలమద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కాగా, మంగళవారం జరిగిన డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ పార్టీలు తమ మద్దతు ఉపసంహరించుకున్నా లేదా తమిళనాడు స్పీకర్ గానీ, కోర్టులు గానీ అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినా రాజకీయ అస్థిరత తలెత్తవచ్చన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని.. పార్టీ నేతలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. అలాగే, గతంలో ఎన్నికల పరాజయాల నుంచి డీఎంకే ఎలా పుంజుకుందో గుర్తుచేస్తూ.. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
‘ఈ ఓటమి తాత్కాలికం. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మనం మళ్లీ గెలుస్తాం. తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు’ అని స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో పాటు తన సొంత నియోజకవర్గం కొలత్తూరులోనూ ఓడిపోయిన స్టాలిన్.. ఓటమికి తానే బాధ్యత స్వీకరిస్తానని పేర్కొన్నారు. అలాగే, సోషల్ మీడియాలో పార్టీ ప్రచారాన్ని పెంచుకోవాలని ఆయన కోరారు.
ఈ విషయంలో విజయ్ టీవీకే చాలా ముందుందని పరోక్షంగా సూచించారు. ‘ఒకప్పుడు మనం టీ దుకాణాల్లో మాట్లాడిన రాజకీయాలను ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మాట్లాడాలి’ అని వివరించారు. ఎన్నికల్లో డీఎంకే ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి, ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాన్ని సేకరించడానికి 36 మంది సభ్యులతో స్టాలిన్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీపై విశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి, పార్టీ ఎక్కడ మద్దతు కోల్పోయిందో గుర్తించడానికి ఇది ఒక ప్రయత్నంగా భావిస్తున్నారు.
