న్యూఢిల్లీ: ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని చూస్తున్న ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, ఇక్కడి రూల్స్‌ను పాటించడానికి ఇష్టపడలేదని, అందుకే ఈ కంపెనీకి ఇంకా తుది అనుమతులు ఇవ్వలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మన దేశ రూల్స్ ప్రకారం ఇక్కడే మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి, భద్రతా నిబంధనలు పాటించడానికి ఆ కంపెనీ ఒప్పుకోవడం లేదన్నారు. ఇండియాలో ఇంటర్నెట్ ఇవ్వాలంటే మన దేశంలోనే లోకల్ బేస్ స్టేషన్లు పెట్టాలని టెలికాం శాఖ తేల్చి చెప్పింది. దేశంలోని యూజర్ల డేటా మొత్తం ఇక్కడి సర్వర్ల నుంచే వెళ్లాలి. విదేశీ సర్వర్లలో ఉంచకూడదు.
అవసరమైనప్పుడు నిఘా పెట్టేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడున్న పెద్ద కంపెనీల గుత్తాధిపత్యాన్ని కాపాడటానికే తమకు అనుమతులు ఇవ్వలేదంటూ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేసింది.
