ఫెయిర్ఫాక్స్ చేతికి ఐడీబీఐ.. దేశ ఆర్థిక రంగంలో ఇదే అతిపెద్ద ఎఫ్డీఐ

ఫెయిర్ఫాక్స్ చేతికి ఐడీబీఐ..  దేశ ఆర్థిక రంగంలో ఇదే అతిపెద్ద ఎఫ్డీఐ
  • 60% వాటా అమ్మకానికి కేంద్రం ఓకే 
  •  డీల్​ విలువ రూ.రూ.52,878 కోట్లు
  •  ఇందులో ఎల్ఐసీ వాటా 30 శాతం 


న్యూఢిల్లీ:ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లో 60.72 శాతం వాటాను రూ.52,878.08 కోట్లకు  ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్​కు అమ్మేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.  ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ కెనడా సంస్థకు కొనుగోలుదారుగా ఆమోదముద్ర వేసింది. వాటా అమ్మకంపై ప్రభుత్వం, ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాక్స్ మధ్య చర్చలు ఈ ఏడాది జులైలో మొదలయ్యాయి. 

ఈ లావాదేవీలో భాగంగా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వానికి ఉన్న 30.48 శాతం వాటాతో పాటు , ఎల్ఐసీకి ఉన్న 30.24 శాతం వాటాను అప్పగిస్తారు. ఒప్పందం తర్వాత ప్రభుత్వానికి 15 శాతం, ఎల్ఐసీకి 19 శాతం చొప్పున మొత్తం 34 శాతం ఉమ్మడి వాటా ఉంటుంది. ఇది భారత ఆర్థిక రంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ) అవుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

బిడ్డింగ్​లో నెగ్గిన ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాక్స్

రెండు దశల పోటీ బిడ్డింగ్ ద్వారా అర్హులను ఎంపిక చేశారు. కేంద్రం 2022లో ఆసక్తి వ్యక్తీకరణలను (ఈఓఐ) ఆహ్వానించింది. బిడ్డర్లు ఆర్​బీఐ, కేంద్ర హోం శాఖ నుంచి భద్రతా అనుమతులు పొందాల్సి వచ్చింది. 2026లో వచ్చిన ప్రారంభ బిడ్లు రూ.94.42 రిజర్వ్ ధర కంటే తక్కువగా ఉండటంతో, 2027 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మళ్లీ సీల్డ్ బిడ్లను ఆహ్వానించింది.  షేరు సగటు విలువ రూ.75.99ను ప్రామాణికంగా తీసుకుంది. 

ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాక్స్ షేరుకు రూ.81 చొప్పున వేసిన బిడ్ ఈ ప్రామాణిక ధరతో పాటు రెండు ఏజెన్సీల అంచనాల కంటే ఎక్కువగా ఉండటంతో సీసీఈఏ ఆమోదించింది.  మిగిలిన 15 శాతం వాటాను ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముకోవచ్చు. ఎల్ఐసీ తన మిగులు వాటాను సొంత అంతర్గత విధానాలు, నియంత్రణ అవసరాల ప్రకారం నిర్వహిస్తుంది.

మెరుగుపడిన ఐడీబీఐ ఆర్థిక స్థితి

1964లో డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఏర్పాటైన ఐడీబీఐ బ్యాంక్ 2004లో వాణిజ్య బ్యాంకుగా మారింది. 2019 నుంచి ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా, 2019 జనవరి 21 నుంచి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ దీనిని ప్రైవేట్ బ్యాంకుగా వర్గీకరించింది. నిరర్ధక ఆస్తులు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏలు, నష్టాల వల్ల 2017 మే 5న ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఆంక్షలు విధించింది. 

వీటిని 2021 మార్చిలో ఎత్తివేసింది. స్థూల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏలు 2018 సెప్టెంబర్ నాటి 31.78 శాతం నుంచి 2026 మార్చి నాటికి 2.32 శాతానికి, నికర ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏలు 17.30 శాతం నుంచి 0.15 శాతానికి తగ్గాయి.  2025లో బ్యాంక్ రూ.9,513 కోట్ల నికర లాభం సాధించగా, గత నెల వరకు మొత్తం వ్యాపారం విలువ రూ.6,27,149 కోట్లకు చేరింది.