నిఫ్టీ టార్గెట్ 27,589కి పెంపు.. సమీపకాలంలో మార్కెట్లపై ఒత్తిడి

నిఫ్టీ టార్గెట్ 27,589కి పెంపు.. సమీపకాలంలో మార్కెట్లపై ఒత్తిడి

హైదరాబాద్​, వెలుగు: ప్రభుదాస్​ లీలాధర్​(పీఎల్) క్యాపిటల్ సంస్థ భారత స్టాక్ మార్కెట్లపై సానుకూలంగా ఉంది. దీని తాజా రిపోర్ట్​ ప్రకారం... భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఎల్ నినో ప్రభావంతో సమీప కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిలో ఉంటాయి.

 నిఫ్టీ గత ఆరు వారాల్లో నిఫ్టీ 8.2 శాతం, ఈ ఏడాదిలో ఆరు శాతం నష్టపోయింది. అయినప్పటికీ 12 నెలల నిఫ్టీ లక్ష్యాన్ని 27,133 నుంచి 27,589కి ఈ సంస్థ పెంచింది. ప్రతికూల పరిస్థితుల్లో ఇది 22,044 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేసింది. దేశంలో చాలాచోట్ల వర్షం తక్కువ పడింది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు విపరీతంగా తగ్గాయి. 2027లో ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉండొచ్చు. 

అమెరికా ట్రెజరీ బిల్లుల రాబడి 5.3 శాతంగా ఉండగా గత 5 ఏళ్లలో నిఫ్టీ– 100 సగటు రాబడి 1.2 శాతమే ఉంది. ఇరాన్, అమెరికా ఘర్షణల వల్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. రెండో క్వార్టర్లో కంపెనీల అమ్మకాలు 16.2 శాతం, ఇబిటా 14.7 శాతం పెరగవచ్చు. 

మార్కెట్లో విలువ ఆధారిత రికవరీ వెంటనే రాకపోవచ్చు.  ఇన్వెస్టర్లు బ్యాంకులు, హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, టెలికం, పోర్టుల రంగాల్లోని బలమైన షేర్లను ఎంచుకోవాలని రిపోర్ట్​ సూచించింది.