బ్రిటన్: గ్రీన్ ల్యాండ్ మిత్రదేశాలపై 10 శాతం వాణిజ్య సుంకాలు విధిస్తామన్న అమెరికా నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా తప్పుబట్టారు. ట్రేడ్ టారిఫ్స్ పేరుతో ట్రంప్ మిత్ర దేశాలను బెదిరించడం పూర్తిగా తప్పు అని అన్నారు. వాణిజ్య యుద్ధం ఎవరికీ ప్రయోజనం కలిగించదని ట్రంప్‌కు చురకలంటించారు. సోమవారం (జనవరి 19) లండన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో గ్రీన్ ల్యాండ్ మిత్ర దేశాలపై 10 శాతం సుంకాలు విధిస్తామన్న ట్రంప్ నిర్ణయంపై స్టార్మర్ స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ల్యాండ్ మిత్రదేశాలపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే అమెరికా ఆలోచనను బ్రిటన్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు. వాణిజ్య సుంకాల బెదిరింపుల ద్వారా సార్వభౌమాధికార సమస్యలను నిర్దేశించలేమని పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధం ఎవరికీ ప్రయోజనం కలిగించదన్నారు. బాహ్య ఒత్తిడి లేకుండా ఆర్కిటిక్ ద్వీపం భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు గ్రీన్లాండ్ ప్రజలు, డెన్మార్క్‌కు ఉందన్నారు. సుంకాల బెదిరింపులు లేదా వ్యూహాత్మక బలవంతం ద్వారా ప్రభావితం చేయొద్దని అమెరికాకు చురకలంటించారు.
గ్రీన్లాండ్ నాటో మిత్రదేశమైన డెన్మార్క్ కింద సెమీ-స్వయంప్రతిపత్తి కలిగిన భూభాగంగా ఉందని గుర్తు చేశారు. అమెరికాతో సంబంధం మాకు చాలా ముఖ్యమని.. అదే సమయంలో అమెరికా తీసుకునే ప్రతి అడ్డమైన నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఉండమని స్పష్టం చేశారు. అమెరికా విధించిన 10 శాతం టారిఫ్స్ కు ప్రతీకారంగా సుంకాలు విధించ ఆలోచన ఇప్పటికైతే తమకు లేదని చెప్పారు.యూరోపియన్ భాగస్వాములు, నాటో మిత్రదేశాలు, యునైటెడ్ స్టేట్స్‌తో యూకే సన్నిహితంగా పనిచేయడం కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాంటించారు.
అమెరికా రక్షణలో భాగంగా గ్రీన్ ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా డెన్మార్క్, యూకే, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టాయి. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ నా నిర్ణయాన్నే వ్యతిరేకిస్తారా అని.. డెన్మార్క్, యూకే, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలపై 10 శాతం ట్రేడ్ టారిఫ్‌లు విధించాడు. 2026, ఫిబ్రవరి 1 నుంచి ఈ సుంకాలు అమలులోకి రానున్నట్లు ప్రకటించాడు.
