- అమెరికా అధ్యక్షుడి వైఖరిని ఖండించిన ఈయూ
- ఇది ఆమోదయోగ్యం కాదన్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్
- ఇది పూర్తిగా తప్పుడు చర్యన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
- చైనా, రష్యాలకు పండుగే: ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్
ఈయూ: డెన్మార్క్ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి గల గ్రీన్‌లాండ్ భూభాగాన్ని సొంతం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీస్తున్నది. గ్రీన్‌లాండ్ ఆక్రమణను వ్యతిరేకిస్తున్న 8 కీలక యురోపియన్ మిత్రదేశాలపై భారీగా సుంకాలను విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతున్నది. ట్రంప్ టారిఫ్ బెదిరింపుల వల్ల సంబంధాలు దెబ్బతిని, పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని యురోపియన్ యూనియన్ (ఈయూ) హెచ్చరించింది.
గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ వైఖరిని ఖండించింది. దీనిపై ఆదివారం బ్రస్సెల్స్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. యూరప్ దేశాలపై ట్రంప్ పన్నుల యుద్ధానికి దిగడం వల్ల అమెరికా–-యూరప్ మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలు కోలుకోలేనంతగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా తీరు వల్ల అట్లాంటిక్ దేశాల మధ్య సంబంధాలు ‘ప్రమాదకరమైన స్థితికి’ చేరుకుంటాయని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ హెచ్చరించారు.
ట్రంప్ తీరుపై ఈయూ నిరసన గళం..
గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ తీరును ఈయూ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా తప్పుడు చర్య అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. నాటో మిత్రదేశాలపై ఇలాంటి సుంకాలు విధించడం సమంజసం కాదని, ఈ విషయాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో చర్చిస్తామని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. ఈ బెదిరింపులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
అమెరికా బ్లాక్‌మెయిల్‌కు లొంగేది లేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ హెచ్చరించారు. దీనిపై ఎలా స్పందించాలనే విషయంపై ప్రస్తుతం ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు, నార్వే, బ్రిటన్‌తో తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఈయూ దేశాలపై ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో చైనా, రష్యా పండుగ చేసుకుంటాయని ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ పేర్కొన్నారు.
మిత్రదేశాల మధ్య విభేదాల వల్ల ఆ రెండు దేశాలు ప్రయోజనం పొందుతాయని అన్నారు. అంతర్జాతీయ చట్టాన్ని కాపాడుకునే విషయంలో ఈయూ ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ట్రంప్ ప్రకటన ఆశ్చర్యకరమని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్‌ముస్సేన్ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
తమ దేశ భద్రత విషయంలో గ్రీన్‌లాండ్ ఎంతో ముఖ్యమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఈ ప్రాంతం డెన్మార్క్ ఆధీనంలో ఉన్నది. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌కు ఈయూ దేశాలు మద్దతుగా నిలిచాయి. అక్కడికి బలగాలను పంపించాయి.
దీంతో గ్రీన్‌లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఈయూ దేశాలపై 10% అదనపు సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాల ఉత్పత్తులపై ఈ సుంకం వర్తిస్తుందని చెప్పారు. జూన్ 1 నాటికి గ్రీన్‌లాండ్ కొనుగోలు ఒప్పందం కుదరకుంటే, దీనిని 25 శాతానికి పెంచుతామని చెప్పారు.
