మెట్రో స్టేషన్ లో మొబైల్ లో పార్కింగ్ బుక్ చేసుకోవచ్చు

మెట్రో స్టేషన్ లో మొబైల్ లో పార్కింగ్ బుక్ చేసుకోవచ్చు

లాస్ట్ మైల్ కనెక్టివిటీ  లక్ష్యంగా  హైదరాబాద్ మెట్రో  మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.  మెట్రో స్టేషన్లలో  పార్కింగ్ సదుపాయం లేకపోవడం వల్ల  చాలామంది  వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు.  పార్కింగ్ సమస్య పరిష్కరించడం ద్వారా  ఎక్కువ మంది ప్రయాణికులను  ఆకర్షించేలా  మెట్రో రైల్ సంస్థ  చర్యలు తీసుకుంటోంది.  ఇందులో భాగంగా  మియాపూర్,  అమీర్​పేట్,  నాగోల్ మధ్యలో  24 స్టేషన్లలో  పెయిడ్ పార్కింగ్  సదుపాయం కల్పించనుంది.  తొలిదశలో  బేగంపేట్  మెట్రో స్టేషన్ లో  స్మార్ట్ పార్కింగ్  సదుపాయాన్ని  ప్రారంభించింది.  పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి  అరవింద్ కుమార్  చేతుల మీదుగా  ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ పార్కింగ్ సిస్టం ను  ప్రారంభించారు.  కార్యక్రమంలో  హెచ్ఎమ్ఆర్ ఎండీ  ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.
‘పార్క్ హైదరాబాద్’  పేరుతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.  ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో  అమలు చేయనున్న ఈ విధానానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ పార్కింగ్ సిస్టంలో  వీలైనంత తక్కువగా  మానవ ప్రమేయం  ఉండేలా  డిజిటల్  పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు.  పార్కింగ్ కు సంబంధించిన వివరాలను మొబైల్ అప్లికేషన్  ద్వారా  తెలుసుకోవచ్చు.  ఏదైనా మెట్రో స్టేషన్ కి వెళ్లడానికి ముందే అక్కడ పార్కింగ్ స్పేస్ ఉందా లేదా  చెక్ చేసుకోవచ్చు. 24 మెట్రో స్టేషన్లలో  ప్రవేశపెట్టనున్న స్మార్ట్ పార్కింగ్ విధానంలో  నాలుగువేల  ద్విచక్ర వాహనాలు,  250  ఫోర్ వీలర్  పార్కింగ్  చేసుకోవచ్చు.

ఇవీ ధరలు….

ఆన్​లైన్​ పేమెంట్ ద్వారా  పార్కింగ్ లో ప్లేస్  బుక్ చేసుకోవచ్చు.  ఉదయం 6 గంటల నుంచి  రాత్రి 10.30 గంటల వరకు  పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. టు వీలర్ అయితే  గంటకు మూడు రూపాయలు,  ఫోర్ వీలర్ అయితే  గంటకు 8 రూపాయలు  చెల్లించాల్సి ఉంటుంది.  రెండు గంటల లోపు షార్ట్ టర్మ్ పార్కింగ్ కోసం  ఐదు రూపాయలు,  15 గంటల కోసం  30  రూపాయలు  చెల్లించవచ్చు.  రెగ్యులర్ గా పార్కింగ్ చేసుకునే వాళ్ళు  మంత్లీ పార్కింగ్ కార్డు  50 శాతం రాయితీతో  తీసుకోవచ్చు.  ఈ కార్డులు  సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే పనిచేస్తాయి.  ఆదివారం పార్కింగ్ కోసం  విడిగా నగదు చెల్లించాల్సి ఉంటుంది.  పార్కింగ్ ప్లేస్ లో  ఫ్రీ వైఫై సదుపాయం కూడా ఉంటుంది.  పార్కింగ్ ఏరియా సీసీ కెమెరాల నిఘాలో  ఉంటుంది.  ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరుగుతున్న నేపథ్యంలో  మెట్రో స్టేషన్లలో  చార్జింగ్ సదుపాయం కల్పిస్తున్నారు.  బేగంపేట్  మెట్రో స్టేషన్ లో  సోమవారం  ఎలక్ట్రిక్ ఛార్జింగ్  మిషన్లను  ప్రారంభించారు. ఎలక్ట్రిక్ కార్లకు  ధరలు నిర్ణయించే వరకు  ఉచితంగా ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పిస్తారు.