
- ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సాయంతోనే యూత్ ముందుకు
- డేటా అనలిటిక్స్, హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్లు
- ఒక్కో కంపెనీలో10 లక్షల నుంచి కోటి వరకు టర్నోవర్
- ఎంటర్‌ప్రెన్యూర్లలో 88 శాతం మంది గ్రాడ్యుయేట్లే.. ఆర్బీఐ పైలట్ సర్వే
హైదరాబాద్, వెలుగు:
సొంత కంపెనీలు ప్రారంభించి, ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగాలనుకుంటున్న యువతకు తగిన ప్రోత్సాహం దొరుకుతలేదు. దేశవ్యాప్తంగా స్టార్ట్‌అప్ కంపెనీలకు బ్యాంకులు, ప్రభుత్వాల నుంచి సరైన ఎంకరేంజ్ మెంట్ ఉంటలేదు. యూత్ ఇన్నోవేటివ్ ఐడియాలతో బిజినెస్ ప్రపోజల్స్ సమర్పించినా బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు వస్తలేవు. అందుకే స్టార్టప్ కంపెనీలు పెట్టాలనుకుంటున్న యువత కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల నుంచి డబ్బులు పోగేసి పెట్టుబడిగా పెడుతున్నారు. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారు. ఇండియన్ స్టార్టప్ రంగంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల నిర్వహించిన పైలట్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 1,246 స్టార్టప్‌లు(ప్రభుత్వ / ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు) పాల్గొన్నాయి. కర్నాటక నుంచి 400, మహారాష్ట్ర నుంచి180, తెలంగాణ నుంచి125 స్టార్టప్‌ల నిర్వాహకులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలు చెప్పారు.
43% మందికి ఫ్యామిలీ, ఫ్రెండ్సే ఆధారం
ఎంటర్‌ప్రెన్యూర్లలో 43 శాతం మంది తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి ఆర్థిక సాయం పొంది స్టార్టప్‌లు ప్రారంభించినట్లు సర్వేలో చెప్పారు. ఇంక్యుబేటర్ ఫండింగ్ ద్వారా13 శాతం మంది, ఇతర పెట్టుబడి వనరుల ద్వారా 9.7 శాతం మంది, సంస్థాగత రుణాల ద్వారా36 శాతం మంది స్టార్టప్ లు పెట్టినట్లు ఈ సర్వేలో తేలింది.
ఎక్కువ స్టార్టప్‌లు ఈ 4 రంగాల్లోనే..
యువత సరికొత్త ఆలోచనలతో గతంలో లేని రంగాల్లో స్టార్టప్ కంపెనీలను ప్రారంభిస్తున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. ప్రధానంగా అవకాశాలు విస్తృతంగా ఉన్న డేటా అనలిటిక్స్, హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ సెక్టార్‌లలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడైంది. అలాగే దేశంలోని70 శాతం స్టార్టప్‌లు గత మూడేళ్లలోనే ఏర్పాటు చేసినట్లు సర్వేలో తేలింది. ఇన్నోవేటివ్ ఐడియాలతో ప్రారంభించిన తమ ఉత్పత్తులపై పేటెంట్ కోసం20 శాతం మంది ఎంటర్‌ప్రెన్యూర్లు అప్లై చేయడం విశేషం.
88% ఎంటర్ ప్రెన్యూర్స్ గ్రాడ్యుయేట్లే..
స్టార్టప్ వ్యవస్థాపకుల్లో 88 శాతం మంది గ్రాడ్యుయేట్లే ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసినవారు39 శాతం మంది, పీజీ చేసినవారు30 శాతం మంది, ఎంబీఏ, సీఏ చదివినవారు18.8 శాతం మంది ఉన్నారు. హైస్కూల్ చదువు పూర్తి చేసినవారు5 శాతం, ఇతరులు7.2 శాతం మంది ఉన్నారు. వీరిలో33 శాతం మంది40 ఏళ్లు దాటినవారు ఉండగా, 30 నుంచి 40 ఏళ్ల మధ్యవారు36 శాతం, 25 నుంచి 30 ఏళ్ల వారు19 శాతం, 20 నుంచి 25 ఏళ్లవారు 9.5 శాతం, 20 ఏళ్లలోపువారు2.2 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తేలింది. వీరిలో 7.3 శాతం మంది ఇంకా స్టూడెంట్స్ గా ఉన్నట్లు తేలింది.
మూసివేత దిశగా 10% స్టార్టప్ లు..
స్టార్టప్‌లలో 58 శాతం కంపెనీలు ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్‌కు చెందినవే ఉండగా, వచ్చే ఐదేళ్లలో ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజీ లిస్టెడ్ కంపెనీల జాబితాలో చేరాలని ఆయా స్టార్టప్ నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో స్టార్టప్ రూ.10 లక్షల నుంచి రూ.కోటి టర్నోవర్ కలిగి ఉండగా, మార్కెట్‌లో ప్రతికూలతలు, నిధుల కొరత కారణంగా10 శా తం కంపెనీలు మూసివేతకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మార్కెట్ సౌకర్యం, ఫైనాన్స్, స్కిల్డ్ లేబర్, టెక్నాలజీ, ప్రతిభ, పంపిణీ వ్యవస్థ లేకపోవడం వంటివి స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలని సర్వే ద్వారా తేలిందని ఆర్బీఐ పేర్కొంది.