
న్యూఢిల్లీ: మైనింగ్ రంగంలో చాలా బిజినెస్ అవకాశాలున్నాయని, ఏటా 7 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్షన్ జరుగుతోందని మైనింగ్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్ చెప్పారు. ఈ సెక్టార్లో చాలా టెక్నాలజీ సవాళ్లున్నాయని, ఇది స్టార్టప్‌లకు మంచి అవకాశమవుతుందని ఆయన అన్నారు. ఈ అవకాశాలను స్టార్టప్‌లు అందిపుచ్చుకోవాలని వివేక్ భరద్వాజ్ పిలుపు ఇచ్చారు. ఐరన్ ఓర్ ప్రొడక్షన్లో గ్లోబల్‌గా మన దేశం నాలుగో ప్లేస్‌లోనూ, బాక్సైట్‌లో అయిదవ ప్లేస్‌లోనూ నిలుస్తోందని పేర్కొన్నారు. అయినా కూడా ఈ రంగంలోకి స్టార్టప్కంపెనీలు రావడం లేదని, ఎక్కువగా ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, ఈ–కామ్ వంటి రంగాలపైనే దృష్టి పెడుతున్నాయని చెప్పారు.
మొదటిసారిగా తలపెడుతున్న స్టార్టప్ సమ్మిట్లోగోను ఆయన లాంఛ్ చేశారు. వర్షాలు పడేటప్పుడు, పొగ మంచు కమ్మినప్పుడు మైనింగ్ చేయడం కష్టతరమవుతుందని, అలాంటప్పుడు మైనింగ్ వర్కర్లతో కమ్యూనికేషన్ కూడా సాధ్యమవదని చెబుతూ, ఇలాంటి సవాళ్లను అవకాశాలుగా స్టార్టప్ కంపెనీలు మలుచుకోవచ్చని సూచించారు. ఆ సవాళ్లకు సరయిన టెక్నాలజీ సొల్యూషన్స్ తేవచ్చని చెప్పారు. క్రోమైట్ నుంచి నికెల్‌ను వేరు చేయడానికి అవసరమైన టెక్నిక్స్ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.
సమ్మిట్‌లో పాల్గొనే వారితో సెక్రటరీ కలిసి మాట్లాడనున్నారు. వివిధ మినరల్స్ ప్రొడక్షన్ పెంచేందుకు ఏ విధంగా స్టార్టప్‌లు సాయపడగలవో తెలుసుకోనున్నారు. ముంబైలో ఈ నెల 29 న మైనింగ్ స్టార్టప్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు జాయింట్ సెక్రటరీ ఫరీదా ఎం నాయక్ వెల్లడించారు. ఐఐటీ ముంబైతో కలిసి ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. సమ్మిట్‌లో 150 దాకా స్టార్టప్‌లు పాల్గొంటున్నాయని, మైనింగ్ సెక్టార్లో కొత్త తరహా బిజినెస్‌లను ఆ స్టార్టప్‌లు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయని కూడా ఫరీదా వెల్లడించారు.