వాట్సాప్ లో మీ సేవ.. బర్త్ సర్టిఫికెట్ నుంచి బిల్లుల దాకా అందులోనే

వాట్సాప్ లో మీ సేవ.. బర్త్ సర్టిఫికెట్ నుంచి బిల్లుల దాకా అందులోనే
  •     580 సేవలను అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం
  •     ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
  •     8096 95 8096 నంబర్‌‌కు వాట్సాప్ చేస్తే 38 శాఖల సర్వీసులు పొందొచ్చు
  •     త్వరలోనే తెలుగు, ఉర్దూలోనూ సేవలు
  •     డిజిటల్​ పాలనను ప్రజలకు చేరువ చేసినం 
  •     ఏటా 10 లక్షల మంది యువతకు ‘ఏఐ’పై శిక్షణ ఇస్తామని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:  ‘మీసేవ’ సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభరతం చేసింది. 38 శాఖలకు చెందిన 580 సర్వీసులను వాట్సాప్​ ద్వారానే పొందే అవకాశం కల్పించింది. బర్త్​ సర్టిఫికెట్ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్​దాకా ఇకపై మీసేవ సెంటర్​కు వెళ్లకుండానే సర్వీసు పొందేందుకు ‘8096958096’ అనే వాట్సాప్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది.  మెటా, మీసేవ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వాట్సాప్​లో మీసేవ’ సర్వీసులను ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు డిజిటల్​ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌ను చేరువ చేయడంలో తెలంగాణను ఇతర రాష్ట్రాలకు రోల్​మోడల్‌‌‌‌‌‌‌‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఏటా 10 లక్షల మంది యువతను ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

ప్రజలను పాలనలో భాగస్వాములను చేస్తున్నం

పాలన అంటే నాలుగు గోడల మధ్యన చేసేది కాదని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు అన్నారు. రాచరిక పోకడలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజలను పాలనలో భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. ‘‘టెక్నాలజీ సాయంతో పౌర సేవలను వారి ముంగిటకే చేరుస్తూ ‘గుడ్ గవర్నెన్స్’ వైపు అడుగులు వేస్తున్నాం. మా ప్రభుత్వం టెక్నాలజీని కేవలం సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూడట్లేదు. ఒక సమానత్వ సాధనంగా చూస్తున్నది. టెక్నాలజీ ఫలాలను రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్​, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్‌‌‌‌‌‌‌‌తో డిజిటల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ లో తెలంగాణ ఒక బెంచ్ మార్క్​ను సెట్​ చేస్తున్నం. 

తాజాగా ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించేలా 580కుపైగా మీసేవ  సర్వీసులను వాట్సాప్​ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలోనే తెలుగు, ఉర్దూలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని వివరించారు. రాబోయే రోజుల్లో ఇతర ప్రభుత్వ విభాగాలకు ఈ వాట్సాప్ సేవలను విస్తరిస్తామని చెప్పారు.  టైప్ చేయాల్సిన అవసరం లేకుండా వాయిస్ కమాండ్‌‌‌‌‌‌‌‌తోనే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, మీ సేవా కమిషనర్ రవి కిరణ్, మెటా ప్రతినిధి నటాషా తదితరులు పాల్గొన్నారు.