- రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక
- పార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకున్నది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ 50 శాతంలోపు రిజర్వేషన్లతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన వెంటనే.. పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి.. రిజర్వేషన్లను ఫైనల్ చేసి పబ్లిష్ చేస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల గెజిట్ జాబితా ఇచ్చి, ఈ నెల 25వ తేదీ కల్లా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం 50 శాతంలోపు రిజర్వేషన్ల జాబితా ఉండేలా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకే రిజర్వేషన్లు ఖరారు చేసి పంపిస్తామని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన టైంలోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు లాంటివన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరోసారి వీటిపై రివ్యూ చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లనున్నది.
3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు
మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేలా సర్కారు ప్లాన్ చేస్తున్నది. దీంతో ఒక్కో విడత పోలింగ్‌కు ఐదు రోజులలోపే గ్యాప్ ఉండనున్నది. ఈ లెక్కన డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించనున్నట్లు తెలుస్తున్నది. డెడికేటెడ్ కమిషన్ పంచాయతీ ఎన్నికల కోసం గతంలోనే రెండు విధాలుగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఇందులో ఒకటి బీసీలకు 42 శాతం ఉండగా.. ఇంకో దాంట్లో అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతం లోపు ఉండేలా రెడీ చేసింది. అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్న 50 శాతంలోపు రిజర్వేషన్ల జాబితాను మరోసారి పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదించనున్నది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుపై జరగవు. ఆయా అభ్యర్థులకు పార్టీలు మద్దతు మాత్రమే ఇస్తాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసే స్థానాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది.
మిగతా పార్టీలపై ప్రభావం
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం మిగతా పార్టీలన్నింటిపై ప్రభావం చూపనున్నది. అనివార్యంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా అదే మార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ల సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. ఇప్పుడు ఆ రకంగా అమలు చేయపోతే .. ఆ పార్టీలకు బీసీలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో చట్ట ప్రకారం ఇప్పటికే 22–23 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. దీనిని చట్టపరంగా 42 శాతంకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు హైకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ప్రకారం నడుచుకోవాలని సూచన చేసింది. ఈ క్రమంలో వచ్చే మార్చిలోగా పంచాయతీల్లో పాలక వర్గాలు కొలువుదీరకపోతే ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన దాదాపు రూ.3 వేల కోట్లు ల్యాప్స్ కానున్నాయి. ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో 50 శాతంలోపే రిజర్వేషన్లతో ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తున్నది.
