కరీంనగర్, వెలుగు : ఏపీ సీఎం జగన్ ప్రోద్బలంతోనే తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేసినట్లుగా తాము భావిస్తున్నామని, ఆయనకు సంబంధం లేకపోతే బొత్సను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రం కేరళ ను మించిపోయిందని, దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు.
టీఎస్ పీఎస్సీలో తప్పు జరిగితే సీఎం కేసీఆర్ కేసు పెట్టి దొంగలను దొరకబట్టారని తెలిపారు. బొత్స సత్యనారాయణ కామెంట్లపై గంగుల తీవ్రంగా స్పందించారు. కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ లో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులంతా తెలంగాణ ఉద్యమం నుంచి ఈ ప్రాంతంపై విషం చిమ్ముతున్నారని, వాళ్ల డీఎన్ఏ కాంగ్రెస్సేనని విమర్శించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మన బతుకు మనం బతుకుతున్నా.. ఆంధ్ర నాయకుల కన్ను తెలంగాణ మీదనే ఉంది. తెలంగాణ లో ఆంధ్ర నాయకులకు ఏం పని? ఒక రోజు షర్మిల, ఓ రోజు చంద్రబాబు, మరో రోజు పవన్ కళ్యాణ్ వస్తున్నరు. దొడ్డి దారిన తెలంగాణకు రావాలని ఆంధ్ర నాయకులు చూస్తున్నరు. ఇక్కడి నిధులు, బొగ్గు ఎత్తకపోదామని చూస్తున్నరు” అని ఆరోపించారు.
ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో గురుకులాలు 298 మాత్రమే ఉండేనని, వాటిలో 83 వేల మంది చదువుకునేవారని గంగుల తెలి పారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 1,009 గురుకులాలను ఏర్పాటు చేసుకుని, 6.75 లక్షల మందిని రాష్ట్ర ప్రభుత్వం చదివిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నదన్నారు. ‘‘ఏపీలో ప్రస్తుతం 308 గురుకులాలు మాత్రమే ఉన్నయ్. అందులో చదివేవాళ్ల సంఖ్య 25 వేల మంది మాత్రమే. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు బొత్స?” అని మండిపడ్డారు.
