రేపటి మోడీ సభతో సీన్ మారిపోతుంది : లక్ష్మణ్

రేపటి మోడీ సభతో సీన్ మారిపోతుంది : లక్ష్మణ్

పార్లమెంట్ ఎన్నికల పార్టీ ప్రచార పాటల సీడీని విడుదల చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోందని చెప్పారు లక్ష్మణ్. రేపటి మోడీ సభతో.. టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అని తేలిపోతుందని చెప్పారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి విస్తృతంగా పర్యటించబోతున్నారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీ నేతలు విసిగిపోయి బీజేపీలోకి వస్తున్నారన్న లక్ష్మణ్.. పొంగులేటి సుధాకర్ రెడ్డి రేపు ఈ వేదికపై బీజేపీ కార్యకర్తలకు పరిచయం అవుతారన్నారు. మాజీమంత్రి విజయరామరావు కూడా బీజేపీలో చేరుతున్నారనీ.. రేపటి సభ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు 3 సభల్లో హిందూత్వాన్ని కించపరిచే మాటలు మాట్లాడారని అన్నారు బండారు దత్తాత్రేయ. కేసీఆర్ మాటలే ఆయనకు రివర్స్ అవుతున్నాయని అన్నారు.  ప్రాంతీయ పార్టీలు కూటమి కట్టినా ప్రధాని క్యాండిడేట్ దొరకడనీ.. కేసీఆర్ చెబుతున్న పార్టీలన్నీ రేపు ఎన్నికలయ్యాక బీజేపీతో కలుస్తాయని చెప్పారు. హిందువులు ఉంటారు కానీ.. దొంగ హిందువులు ఉండరని చెప్పిన దత్తన్న.. రామమందిరంపై కేసీఆర్ వైఖరేంటో చెప్పాలన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న టైమ్ లో ఒక్క క్యాబినెట్ మీటింగ్ కు కూడా పోలేదనీ.. సైనికులకు పూర్తి స్వేచ్చనిచ్చిన ఘనత నరేంద్రమోడీదే అని దత్తాత్రేయ చెప్పారు. కేసీఆర్ మాటలు సైనికులను అవమానపరిచేవిధంగా వున్నాయన్నారు.

ఎల్బీ స్టేడియం సభతో టీఆర్ఎస్ కు అపశకున సంకేతాలు మొదలయ్యాయని దత్తాత్రేయ అన్నారు. ఇకనుంచి బీజేపీ వేవ్ పెరుగుతుందని …. కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందనీ చెప్పారు.