
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విషయంలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర నేతల్లో జోష్ కనిపిస్తోంది. కాశ్మీర్ అంశం తమకు అందివచ్చిన వరంగా మారిందని.. రాష్ట్రంలో తమ పార్టీకి ఊపు తెస్తుందని వారు అంటున్నారు. టీఆర్ఎస్తో ఢీకొట్టగలిగేది, ప్రత్యామ్నాయంగా నిలిచేది తామేనని.. మున్సిపల్ ఎలక్షన్లలో సత్తా చాటుతామని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. కాశ్మీర్ అంశంపై పార్టీ తీరుతో కేడర్ డీలా పడింది.
సభ్యత్వ నమోదు ఊపులో..
రాష్ట్రంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా.. లోక్‌సభ ఎలక్షన్లలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో కొంత ఊపు కనిపించింది. తెలంగాణలో బలోపేతం కావడానికి అనుకూల వాతావరణం ఉందన్న అభిప్రాయం కల్పించింది. అదే ఊపులో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మెంబర్షిప్ డ్రైవ్ కూడా చేపట్టింది. పల్లె, పట్నం తేడా లేకుండా దాదాపు అన్ని ప్రాంతాల్లో మెంబర్‌షిప్‌కు ఆదరణ కనిపించింది. ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి కొందరు సీనియర్ నేతలు బీజేపీలోకి రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎలక్షన్లలో సత్తా చాటాలని, రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి సమయంలో జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలకు అతీతంగా అందరూ దీనిని హర్షిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు మంచిపని చేసిందంటూ ప్రశంసిస్తున్నారు. ఇది బీజేపీకి మరింత సానుకూల పరిస్థితిని సృష్టించిందని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే బీజేపీకి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు.
పట్టణ ఓటర్లు తోడొస్తారు..
సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లలో చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ అంశాలు, ఉద్వేగ పూరిత అంశాలపై అవగాహన కూడా ఎక్కువే. ఇప్పుడు జమ్మూకాశ్మీర్ విషయంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న ఎలక్షన్లు పట్టణ ప్రాంతాలకు సంబంధించినవే కావడం, అర్బన్ ఏరియాల్లో సహజంగానే బీజేపీకి మద్దతు పెరుగుతుండటానికి తోడు.. ఇప్పుడీ సానుకూల పరిస్థితి బీజేపీకి తోడ్పడుతుందని అంటున్నారు. అందువల్లే మున్సిపల్ ఎలక్షన్లలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది.
కాంగ్రెస్ కేడర్ డీలా..
అసెంబ్లీ ఎలక్షన్ల నాటి నుంచి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం మరింత డీలా పడుతోంది. లోక్‌సభ ఎలక్షన్లలో మూడు సీట్లే గెలుచుకోవడం, పంచాయతీ, జెడ్పీ ఎలక్షన్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. తర్వాత పలువురు సీనియర్ నేతలు అటు టీఆర్ఎస్వైపు, ఇటు బీజేపీ వైపు వెళ్లిపోవడంతో పార్టీ ఇబ్బందుల్లో పడింది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం కూడా ప్రభావం చూపింది. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారుపై నెలకొన్న వ్యతిరేకత మున్సిపల్ ఎలక్షన్లలో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావించింది. కానీ జమ్మూకాశ్మీర్ అంశం మరోసారి దెబ్బతీసింది. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ హైకమాండ్ వ్యతిరేకిస్తుండటంతో రాష్ట్ర నేతలెవరూ కూడా ఈ అంశంపై స్పందించడం లేదు. ఇది కేడర్‌లో అయోమయానికి కారణమైంది. మొత్తంగా కాశ్మీర్ అంశం రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల పరిస్థితిపై ఎలా ప్రభావం చూపుతుందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.