లాక్‌డౌన్ స‌మ‌యంలో రోడ్ల శంకుస్థాపనలా?

లాక్‌డౌన్ స‌మ‌యంలో రోడ్ల శంకుస్థాపనలా?

టీఆర్ఎస్ నాయ‌కుల‌పై ఫైర్ అయ్యారు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్. త‌మ పార్టీకి చెందిన యాచారం మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సుకన్య భాషకు స‌మాచారం ఇవ్వ‌కుండానే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్ణయించడాన్ని ఆయ‌న తప్పుప‌ట్టారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన రోడ్ల నిర్మాణాల శంకుస్థాపన ఇంత ఆద‌రాబాద‌రా గా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయ‌న ప్రశ్నించారు.

రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఫార్మాసిటీని లింక్ చేయడం కోసం నిర్మించాల్సిన రోడ్డుకు లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో శంకుస్థాపన చేయడం వెనక ఉన్న వ్యూహం ఏంటని సంజయ్ నిలదీసారు. ఫార్మా సిటీ నిర్మాణం వెనక కేటీఆర్ గారి స్వప్రయోజనాలు, సొంత ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయనేది దీని ద్వారా అర్థం అవుతుందన్నారు. రాష్ట్రాలేమైనా బిచ్చగాళ్లా అని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ కు ప్రజాప్రతినిధులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా అని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసుకోవాలని కూడా బిచ్చగాళ్లలాగా అడుక్కోవాలా అంటూ ప్ర‌శ్నించారు.

బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావుపై టీఆర్ఎస్ ప్రోద్బలంతోనే పోలీసులు దాడి చేశారని, ఇక చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దళిత బాలికపై టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం పార్టీ కార్యకర్త అత్యాచారం కేసులో ఎమ్మెల్యే బలాల ప్రవర్తించిన తీరు, బిజెపి దళిత నాయకురాలును ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం వెనక కూడా టీఆర్ఎస్ ప్రోద్బలం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో దళితులపైన, మహిళలపైన దాడులు జరిగినా, హత్యాచారాలు జరిగినా కేసులు పెట్టకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అప్రజాస్వామికమని బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

యాచారం ఘటనపై డీజీపీ వెంటనే స్పందించి బిజెపి నాయకులపై దాడి చేసిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని బిజెపి డిమాండ్ చేస్తున్న‌ద‌న్నారు.

State BJP president Bandi Sanjay serious on TRS leaders