
- ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి.. ‘వెలుగు’ ఇంటర్వ్యూలో రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్
- మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వాడుకోకపోతే ఎట్ల?
- పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నం
- లీడర్ల స్పీచ్‌లపై చాలా ఫిర్యాదులు వస్తున్నయ్
- వాటిపై రిపోర్టులు తెప్పించుకొని ఈసీకి పంపిస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : లిటరసీ, డెవలప్మెంట్ పెరిగితే కుల, మత ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ అన్నారు. గతంతో చూస్తే ఇప్పటికే ఓటర్లలో చైతన్యం పెరిగిందని.. ఎన్నికకు ఎన్నికకు ఈ వ్యత్యాసం కనిపిస్తున్నది తెలిపారు. పదేండ్ల తర్వాత కేవలం డెవలప్మెంట్ ఎజెండాగా ఎన్నికల ప్రచారం జరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు ఉండి కొంతమంది వినియోగించుకోవడం లేదని.. ఇట్లయితే భవిష్యత్‌లో ‘తప్పనిసరి ఓటింగ్(నిర్బంధ ఓటు)’ అంశం తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా పొలిటికల్ పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న టఫ్ పైట్ ఆధారంగా ఎన్నికల ఖర్చు విపరీతంగా పెడుతున్నట్లు ఈసీ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ శాతం, క్యాంపెనియింగ్ అంశాలపై సీఈవో వికాస్ రాజ్ ‘వెలుగు’కు శుక్రవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
పోలింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నం
‘‘రాష్ట్రంలో ఓటర్ల నమోదు సక్సెస్‌ఫుల్‌గా చేశాం. ఇప్పుడు తెలంగాణలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 71.34 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతిసారి టార్గెట్ వందశాతం పెట్టుకుంటాం. లోక్‌సభ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఓటింగ్ శాతాన్ని దాటాలని అనుకుంటున్నాం. దాంతో పాటు ఈసారి ఏపీలో కూడా 13వ తేదీనే పోలింగ్ ఉండటం ఇక్కడి పోలింగ్ శాతంపై కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నవాళ్లు కొంతమంది ఉంటే ఉండవచ్చు. అయితే వారంతా రెండు చోట్ల ఓటు వేసే అవకాశం అయితే లేదు. దాంతో పాటు ఎండాకాలం కావడం కొంత మైనస్. అయినప్పటికీ ఎండల ప్రభావం దృష్ట్యా ఈసీ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌కు అవకాశం ఇచ్చింది. మేం కూడా 35 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటరు స్లిప్పుల పంపిణీ కూడా దాదాపు పూర్తి చేశాం” అని సీఈవో వికాస్‌రాజ్ అన్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ అంతగా ఉండటం లేదని, ఓటు అనేది ఆయుధం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన కోరారు. ‘‘పోలింగ్ కేంద్రానికి వచ్చి 10 నిమిషాలు ఓటు వేసేందుకు బద్ధకమా? ఐదేండ్ల భవిష్యత్ కదా.. ఓటర్లు ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? ఇలాగే ఉంటే.. భవిష్యత్‌లో ఓటు వేయడం తప్పనిసరి చేస్తారేమో అనిపిస్తుంది. ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈసీ కూడా ఓటింగ్‌ను పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఇతర దేశాల్లో ఓటింగ్ సరళిని అధ్యయనం చేస్తున్నది. ఎలాంటి అవకతవకలు లేకుండా ఒక ఓటరు తన ఓటును ఎక్కడి నుంచైనా క్యాస్ట్ చేసేలా ఉంటే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ ఇంకా చర్చలు, ఆలోచనల్లోనే ఉన్నాయి” అని వికాస్‌రాజ్ తెలిపారు.
లీడర్ల స్పీచ్‌లపై చాలా కంప్లయింట్స్
శనివారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం ముగుస్తుందని వికాస్‌రాజ్ చెప్పారు. ‘‘ప్రచారంలో వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉండొద్దు. కానీ ఈ మధ్య కాలంలో ప్రచారం దారి తప్పుతున్నట్లు కనిపిస్తున్నది. ఈసీకి, సీఈవో కార్యాలయానికి లీడర్ల ప్రసంగాలపై చాలా కంప్లయింట్స్ వస్తున్నాయి. వాటి మీద క్షేత్రస్థాయి రిపోర్ట్ తెప్పించుకుని ఈసీకి పంపుతున్నాం. అందుకు తగ్గట్టుగానే ఈసీ చర్యలు తీసుకుంటుంది. మతం, కులం పేరుతో ఓట్లు అడగడం, ప్రచారం చేయడానికి వీల్లేదు. అలా కూడా చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఎప్పుడైతే లిటరసీ పెరిగి.. డెవలప్మెంట్ పెరిగితే ఓటర్లలో ఇంకా చైతన్యం పెరుగుతుంది. అలాంటప్పుడు ఒకవేళ పొలిటికల్ లీడర్లు, పోటీలో ఉండే క్యాండిడేట్లు మతం పేరుతో, కులం పేరుతో ప్రచారం చేసినా.. ఓట్లు అడిగినా లాభం ఉండదు. ఇంకో పదేండ్ల తర్వాత కేవలం డెవలప్మెంట్ ఎజెండాగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని నా అంచనా” అని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా సరే ఈసీ నిర్దేశించిన దానికంటే అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేసినట్లు తేలితే వాళ్లు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఖర్చు చేసేందుకు రూ.90 లక్షల లిమిట్ ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 34 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులు, 17 మంది జనరల్ అబ్జర్వర్స్ అంతా మానిటర్ చేస్తున్నారు” అని ఆయన వివరించారు.