ఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్లకు జూలై 19నుంచి దరఖాస్తులు

ఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్లకు జూలై 19నుంచి దరఖాస్తులు
  • వచ్చే నెల 10 వరకు అప్లికేషన్ల స్వీకరణ 
  • షెడ్యూల్  విడుదల చేసిన హయ్యర్  ఎడ్యుకేషన్ కౌన్సిల్ 
  • అందుబాటులో 33 వేల సీట్లు 

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్  కాలేజీల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ‘బీ’ -కేటగిరీ సీట్ల భర్తీకి రాష్ట్ర హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) షెడ్యూల్  విడుదల చేసింది. ఈ నెల19న అడ్మిషన్ నోటిఫికేషన్  విడుదల చేయనుంది. గురువారం టీజీసీహెచ్ఈ ఆఫీసులో  కౌన్సిల్  చైర్మన్  ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన అధికారులు సమావేశమయ్యారు. అనంతరం షెడ్యూల్ రిలీజ్  చేశారు. 

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 19 నుంచి ఆగస్టు 10 వరకూ ప్రైవేటు కాలేజీల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు14 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఏఐసీటీఈ గైడ్​లైన్స్ కు  అనుగుణంగా ఎప్​సెట్ –2025, జోసా, సీఎస్‌‌‌‌‌‌‌‌ఏబీ తదితర అడ్మిషన్  కౌన్సెలింగ్​ను సమన్వయం చేసుకుంటూ ఎప్ సెట్ బీ కేటగిరి సీట్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం  www.tgche.ac.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను చూడాలని సూచించారు. 

కాగా..  రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్ మెంట్  కోటాలో భారీగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ‘బీ’ కేటగిరిలో సుమారు 33వేల వరకూ సీట్లు ఉన్నాయని  అధికారులు చెప్తున్నారు. అయితే, ఇప్పటికే ప్రైవేటు కాలేజీల్లో సీట్ల అమ్మకాలు ప్రారంభించారు. ఏ నిబంధనలతో సంబంధం లేకుండానే డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే, వారికే సీట్లు ఇస్తున్నారు. నిరుడు బీ కేటగిరి కింద 27,936 సీట్లు భర్తీ అయ్యాయి. 

15 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో

ప్రతి కోర్సులో మంజూరైన సీట్ల సంఖ్యలో 15 శాతం మించకుండా ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. క్వాలిఫైయింగ్  ఎగ్జామ్​లో గ్రూప్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో, లేదా 50 శాతం మొత్తం మార్కులతో పాసైన వారికి ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ/ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ స్పాన్సర్డ్  అభ్యర్థులను చేర్చుకోవచ్చు. ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ కోటాలో ఖాళీగా ఉన్న సీట్లు ఏవైనా ఉంటే, వాటిని జేఈఈ (మెయిన్స్) లో ఆల్  ఇండియా ర్యాంకు సాధించిన అభ్యర్థులతో నింపుకోవచ్చు. ఇంకా మిగిలితే ఎప్​సెట్  మెరిట్  ఆధారంగా సీట్లు భర్తీ చేసుకోవాలి. 

ఇవీ నిబంధనలు..

ప్రతి కాలేజీ కనీసం మూడు పేపర్లలో ‘బీ’ కేటగిరి సీట్ల అడ్మిషన్  నోటిఫికేషన్  రిలీజ్ చేయాలి. దీంట్లో బ్రాంచుల వారీగా మేనేజ్ మెంట్, ఎన్ఆర్ఐ సీట్లు, దరఖాస్తు ఫార్మాట్, చెల్లించాల్సిన ఫీజు, ట్యూషన్  ఫీజు వివరాలను పెట్టాలి. దరఖాస్తుల తేదీలు, వాటిని ఎక్కడ ఇవ్వాలనే వివరాలు కూడా నోటిఫికేషన్ లో పొందుపర్చాలి.

23 నుంచి బీఆర్క్ రిజిస్ర్టేషన్లు..

బ్యాచిలర్  ఆఫ్  ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశాల కోసం టీజీసీహెచ్ఈ  షెడ్యూల్  రిలీజ్  చేసింది. మూడు విడతల్లో అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గురువారం టీజీసీహెచ్ఈ  ఆఫీసులో కౌన్సిల్  చైర్మన్  బాలకిష్టారెడ్డి అధ్యక్షతన అడ్మిషన్ల కమిటీ సమావేశం జరిగింది. 

సమావేశంలో వైస్  చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరామ్  వెంకటేశ్  తదితరులు పాల్గొన్నారు. దీంట్లో బీఆర్క్  అడ్మిషన్  షెడ్యూల్​ ఖరారు చేశారు. ఈ నెల 21న నోటిఫికేషన్  రిలీజ్  చేయనున్నారు. ఈ నెల 23 నుంచి 31 వరకు ఆన్ లైన్  రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో ఆగస్టు 16 నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు 20న సీట్లు కేటాయించనున్నారు.