క్రిమినల్​ కేసులుంటే చెప్పాలె..క్యాండిడేట్లకు ఈసీ ఆదేశం

క్రిమినల్​ కేసులుంటే చెప్పాలె..క్యాండిడేట్లకు ఈసీ ఆదేశం
  •     ఆస్తులు, అప్పుల వివరాలతో  అఫిడవిట్​ ఇయ్యాలె
  •     గ్రేటర్​ ఎన్నికల్లో పోటీ చేసే  క్యాండిడేట్లకు ఎస్​ఈసీ ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే క్యాండిడేట్లు..తమపై క్రిమినల్​ కేసులుంటే తప్పనిసరిగా వెల్లడించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆస్తులు, అప్పుల వివరాలతో రూ.20 స్టాంప్​ పేపర్​పై అఫిడవిట్​ సమర్పించాలని పేర్కొంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్​ పేపర్లతో పాటే అఫిడవిట్​నూ ఇవ్వాలని పేర్కొంది. అఫిడవిట్​ను పూర్తిగా నింపకున్నా, వివరాలు సరిగా ఇవ్వకపోయినా నామినేషన్​ తిరస్కరిస్తామంది. పోలింగ్​ కేంద్రాల వారీగా మరణించిన వారి ఓట్లు, డూప్లికేట్​ ఓట్లను గుర్తించాల్సిందిగా రిటర్నింగ్​ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చింది.  పోలింగ్​ స్టేషన్ల వారీగా ఓటు హక్కు వేయలేకపోయిన వారు, మరణించిన వారి జాబితా తయారు చేసి సమర్పించాలని చెప్పింది. బ్యాలెట్​ పేపర్​ కౌంటర్​ ఫైల్​పై తప్పనిసరిగా ఓటరు సంతకం లేదా వేలి ముద్ర తీసుకోవాలంది.

వృద్ధులు, వికలాంగులకు పోస్టల్‌‌ బ్యాలెట్‌‌

కరోనా నేపథ్యంలో జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులు, కరోనా పాజిటివ్‌‌గా పేషెంట్లకు పోస్టల్‌‌ బ్యాలెట్‌‌ సౌకర్యం కల్పిస్తూ ఎస్​ఈసీ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్లు, సైన్యంలో పనిచేసే వారు, వారి భార్యలకే పోస్టల్‌‌ బ్యాలెట్‌‌ సౌలత్​ ఉంటుందని, కరోనా వల్ల 80 ఏండ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు, నవంబర్‌‌ ఒకటి తర్వాత పాజిటివ్‌‌గా తేలిన వారికి ఈ సౌలత్ ఉంటుందని పేర్కొంది. ఈ కేటగిరీల వ్యక్తులు tsec.gov.in వెబ్‌‌సైట్‌‌ నుంచి ఫామ్–22ఏ డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవాలంది. డివిజన్‌‌ రిటర్నింగ్‌‌ ఆఫీసర్ల వద్ద కూడా ఫామ్స్ ఉంటాయంది. ఓటర్లు ఫామ్ నింపి ఫొటో అతికించి సెల్ఫ్‌‌ అటెస్టేషన్‌‌ చేయాలని, ఓటర్‌‌ ఐడీ కార్డు లేదా, పాస్ట్‌‌ పోర్ట్‌‌, ఆధార్‌‌ కార్డుల్లో ఏదో ఒకటి జత చేసి రిటర్నింగ్‌‌ అధికారికి ఇవ్వాలంది. పోలింగ్‌‌ తేదీకి 4 రోజుల ముందే తమ బ్యాలెట్‌‌ను ఆర్వోకు అందజేయాలంది. పోస్ట్‌‌లోనూ 4 రోజుల ముందే చేరేలా పంపాల్సి ఉంటుందని వివరించింది.

జనసేన సహా ఐదు పార్టీలకు కామన్‌‌ గుర్తులు

జనసేన సహా స్టేట్‌‌ ఎలక్షన్‌‌ కమిషన్‌‌(ఎస్​ఈసీ) వద్ద రిజిస్టరైన 5 రాజకీయ పార్టీలకు కామన్‌‌ గుర్తులు కేటాయిస్తూ ఎస్‌‌ఈసీ గురువారం ఆర్డర్లు ఇచ్చింది. జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో సంబంధిత పార్టీలకు కేటాయించిన గుర్తులు ఆ పార్టీ నుం చి పోటీ చేసే క్యాండిడేట్లు కేటాయిస్తామని పేర్కొంది. జనసేనకు గాజుగ్లాస్‌‌, హిందుస్థాన్‌‌ జనతాపార్టీకి కొబ్బరి తోట, ఇండియా ప్రజాబంధు పార్టీకి ట్రంపెట్‌‌, మార్కిస్ట్‌‌ కమ్యూనిస్ట్‌‌ పార్టీ ఆఫ్‌‌ ఇండియా యునైటెడ్‌‌కు గ్యాస్‌‌ సిలెండర్‌‌, ఇండియన్‌‌ ప్రజా కాంగ్రెస్‌‌కు విజిల్‌‌ గుర్తులను కేటాయించింది. ఆయా పార్టీల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఎలక్షన్‌‌ అథారిటీ నామినేషన్ల గడువు ముగిసే నాటికి బీ–ఫామ్​ జారీ చేసే అధికారాన్ని ఎవరికి ఇస్తున్నారో తెలుపుతూ ఎస్‌‌ఈసీకి ఏ–ఫామ్ అందజేయాలని సూచించింది. ఆయా పార్టీల తరఫున పోటీ చేసే క్యాండిడేట్లు బీ–ఫామ్ లను నామినేషన్లు ఉపసంహరించుకునేలోగా సమర్పిస్తే వారిని పార్టీ క్యాండిడేట్‌‌గా గుర్తించి ఆ పార్టీకి ఇచ్చిన గుర్తును అలాట్‌‌ చేస్తామని ప్రకటించింది. కామన్‌‌ సింబల్‌‌ పొందిన పార్టీలు ఐదేళ్ల కాలంలో జరిగే ఎన్నికల్లో 10 శాతం సీట్లకు అభ్యర్థులను పోటీకి నిలపాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కామన్‌‌ సింబల్‌‌ను కోల్పోవడంతో పాటు రానున్న ఐదేళ్ల పాటు తిరిగి కామన్‌‌ సింబల్‌‌ పొందే అవకాశాన్ని కోల్పోతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.