లోకల్ బాడీ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కీలక భేటీ

లోకల్ బాడీ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కీలక భేటీ

హైదరాబాద్: రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో లోకల్ బాడీ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కీలక భేటీ నిర్వహించింది. శనివారం (సెప్టెంబర్ 27) స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్‎లో సీఎస్ రామకృష్ణా రావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్, పంచాయతీ రాజ్ సెక్రటరీ శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వీరితో పాటు ఆర్ధిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎక్సై్జ్ శాఖ కమిషనర్ హరికిరణ్ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ బందోబస్తు, రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించారు. ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలి..? మొత్తం ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. 

కాగా, స్థానిక సంస్థల (రూరల్, అర్బన్)​ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలసిందే. ఈ మేరకు రిజర్వేషన్లు పెంచుతూ శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ నుంచి జీవో నంబర్​ 9ని విడుదల చేయించింది. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుల ఆధారంగా, బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ జీవోను వెంటనే అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

 అణగారిన వర్గాలు అందరితోపాటు ఎదగాలన్నదే తమ ఉద్దేశమని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.