ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు! 18 ఏండ్లు నిండిన యువత నమోదు చేసుకునే చాన్స్

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు! 18 ఏండ్లు నిండిన యువత నమోదు చేసుకునే చాన్స్
  • మృతి చెందిన వారి పేర్లు లిస్టు నుంచి తొలగింపు
  • గ్రామం యూనిట్​గా వార్డుల వారీగా రూపకల్పన
  • ఒక కుటుంబం ఓట్లన్ని ఒకే వార్డులో..
  • ఎంపీటీసీ స్థానాల పునర్​ విభజనతో అదనపు గ్రామాల ఓటర్లు టీ పోల్ యాప్​లో అప్​లోడ్ 
  • రాష్ట్రంలో 565 మండలాల నుంచి 564కు కుదింపు
  • మరో 18 గ్రామాలకు గెజిట్ రికార్వింగ్?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో పంచాయతీ రాజ్ శాఖ గ్రామం యూనిట్ గా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మళ్లీ రెడీ చేస్తున్నది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను తయారుచేసి నేరుగా ఎంపీడీవో లాగిన్ ద్వారా టీపోల్ సాఫ్ట్ వేర్​లో చేర్చారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గ్రామాలు, వార్డుల్లో ఓటర్ల సంఖ్య మారే అవకాశం ఉంది. టీపోల్ వెబ్​సైట్​లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్లీ మొదటి నుంచి ఓటర్ల జాబితా రెడీ చేయనున్నారు. ఇప్పటివరకు ఎంపీడీవో లాగిన్ తో రూపొందించిన ఓటర్ల జాబితాను టీపోల్ సాఫ్ట్​వేర్ నుంచి తొలగించారు. దాని స్థానంలో కొత్తగా రూపొందించే జాబితాను పంచాయతీ కార్యదర్శి లాగిన్ ద్వారా అప్లోడ్ చేయనున్నారు. దానిని ఎంపీడీవో ధ్రువీకరించిన తర్వాత జిల్లా పంచాయతీ అధికారికి పంపుతారు. తర్వాత తుది జాబితా రూపొందుతుంది.

కొత్త ఓటర్లకు చాన్స్​ 
ఓటర్ల జాబితాలో స్వల్ప మార్పులు చేర్పులు జరిగే చాన్స్ ఉంది. పాత జాబితా రూపొందించి ఇప్పటికే ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆర్నెళ్ల సమయంలో మృతి చెందినవారుంటే వారి పేర్లను జాబితా నుంచి తొలగించనున్నారు. 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఒక కుటుంబంలో కొత్త ఓటర్లు యాడ్​ అయితే వారందరి ఓట్లు ఒకే వార్డులో ఉండేలా నమోదు చేస్తున్నారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండేవి. ఇప్పుడు అలాకాకుండా ఓకే చోట చేర్చుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని వార్డుల వారీగా మళ్లీ జాబితా రూపొందిస్తున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి 6న తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం విడుదల చేసింది. 

రాష్ట్రంలో 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళలు, 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,45,026 మంది 18–-19 సంవత్సరాల ఓటర్లు, 2,22,091 మంది 85 ఏండ్లు దాటిన సీనియర్ ఓటర్లు, 3,591 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. 5,26,993 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అతి తక్కువగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు. మళ్లీ కొత్త జాబితా నమోదు, మరణించినవారి పేర్లను జాబితా నుంచి తొలగింపు కార్యక్రమం చేపడుతుంటంతో రాష్ట్ర ఓటరు జాబితాలో స్వల్పమార్పులు చోటుచేసుకోనున్నాయి.

మళ్లీ ఎంపీటీసీ స్థానాలు తగ్గొచ్చు
రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామపంచాయతీలు జీహెచ్ఎంసీ, వివిధ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని పంచాయతీలు మున్సిపాల్టీల్లో విలీనమయ్యాయి. ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్ చేశారు. ఈ గ్రామాల్లోని ఎంపీటీసీ స్థానాల పరిధిలోని ఓటర్లను టీపోల్ యాప్ లో నమోదు చేస్తున్నారు. ఆయా మండల్లాలోని ఎంపీటీసీ స్థానాల పరిధిలోని ఓటర్లను మెర్జ్​ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 565 మండలాలు ఉండగా.. అందులో జిన్నారం, ఇంద్రేశంలను మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించింది. జిన్నారం మండలం జాబితా నుంచి తొలగించడంతో మండలాల సంఖ్య 564 చేరింది.

ఈ రెండు మండలాల పరిధిలో దాదాపు 18 గ్రామపంచాయతీలు ఉంటాయి. అవి పూర్తిస్థాయిలో మున్సిపాల్టీల్లో కలిస్తే ఇప్పుడున్న ఎంపీటీసీల సంఖ్యలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో మళ్లీ ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గే చాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ 18  పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ, మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ) డీలిమిటేషన్ కోసం త్వరలోనే షెడ్యూల్‌‌‌‌ జారీ చేసే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ పంచాయతీలను మున్సిపాల్టీలు నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేయాలి. పంచాయతీరాజ్ శాఖ డీనోటిఫై చేయాలి. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరుశాఖల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే పూర్తిస్థాయిలో ఎంపీటీసీ స్థానాలు లెక్క తేలనున్నది.