
- ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి సిరా వేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల చేతి వేలికి సిరా (ఇన్‌డెలిబుల్ ఇంక్) వేయడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్వల్ప మార్పు చేసింది. ఒక వ్యక్తి రెండుసార్లు ఓటు వేయకుండా ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఎడమ చేతి మధ్య వేలు (మిడిల్ ఫింగర్)కు సిరా వేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమచేతి చూపుడు వేలికి (ఫోర్ ఫింగర్) ఇంక్ వాడేవారు.
పంచాయతీ ఎన్నికల్లో ఒక వ్యక్తి బహుళ ఓట్లు వేయకుండా అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంది. ఈ మార్పుపై ఎన్నికల అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించాలని, దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ మకరందు తెలిపారు.