- జిల్లా ఆఫీసర్లలో వీసీలో కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు.
సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్లు, శాంతిభద్రత వంటి అంశాలపై సమీక్షిస్తూ ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. మెదక్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు ప్రారంభించామని తెలిపారు.
రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించడంతో పాటు, సిబ్బంది, ఎన్నికల సామాగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అనంతరం గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమావేశమై 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డుల ఎన్నికలకు ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, ఏఎస్పీ మహేందర్, డీఆర్‌వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్యతో పాటు ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు.
