గ్రేటర్ వరంగల్, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆమె జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ నుంచి కలెక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్, అడిషనల్ కలెక్టర్ జి.సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిపై వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఉందన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్పంచ్ లు, వార్డు సభ్యులకు జరుగుతున్న ఎన్నికల నిర్వహణను విజయవంతం చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.
ఎన్నికల సంఘం జారీ చేసిన నియమనిబంధనలు ఉల్లంఘించిన, అతిక్రమన వంటి ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్ లో టోల్ఫ్రీని ఏర్పాటు చేశామని, 1800 4253424, 91542 52936, 0870 2530812 కు సమాచారం ఇవ్వలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీఆర్డీవో రాంరెడ్డి, డీపీవో కల్పన, వరంగల్ ఆర్డీవో ఉమా, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి తదితరులు
పాల్గొన్నారు.
