పల్లెకు పట్టాభిషేకం..రాష్ట్ర బడ్జెట్‌‌‌‌ లో 10.39 శాతం నిధులు కేటాయింపు

పల్లెకు పట్టాభిషేకం..రాష్ట్ర బడ్జెట్‌‌‌‌ లో 10.39 శాతం నిధులు కేటాయింపు
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.33,688 కోట్లు
  • గతేడాదితో పోలిస్తే  రూ.2,083 కోట్లు పెరుగుదల
  • మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.2,500 కోట్లు 
  • 2,980 కిలోమీటర్ల మేర పల్లెల్లో బీటీ రోడ్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పల్లె వికాసానికి పెద్దపీట వేసింది. 2026–27 బడ్జెట్‌‌‌‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అగ్రతాంబూలం ఇచ్చింది. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధిని లక్ష్యంగా చేసుకుని ఈ సారి రూ.33,688 కోట్లు కేటాయించింది. ఇందులో 27,794 కోట్లు జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం.. 5,893 కోట్లు పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు జరిగాయి.

గతేడాది (2025–26)లో ఈ కేటాయింపు రూ.31,605 కోట్లుగా ఉండగా.. ఈ సారి సుమారు రూ.2 వేల కోట్లకు పైగా అదనంగా ఇవ్వడం విశేషం. దీనివల్ల పల్లెల్లో పాలన, అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి. కాగా, మొత్తం రూ.3.24 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో ఇది 10.39 శాతంగా ఉండటం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఈసారి కేటాయింపులను రూ.2,083 కోట్లు పెంచింది.

గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) పద్ధతిలో రోడ్ల అభివృద్ధిని చేపట్టనున్నారు. ఈ ఏడాది కొత్తగా 2,980 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీరాజ్ రోడ్లు రూ. 2,622 కోట్లు, పీఆర్ హ్యామ్ రోడ్లకు రూ.1,372 కోట్లు, కొత్త రోడ్ల నిర్మాణం కోసం రూ.750 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల రిపేర్లు, వరద నష్టాల నివారణకు సుమారు రూ.500 కోట్లు కేటాయించింది.

మిషన్ భగీరథ స్కీమ్​లో భాగంగా తాగునీటి సరఫరా కోసం తీసుకున్న రుణాల చెల్లింపులు, నిర్వహణకు మొత్తం రూ.900 కోట్లు కేటాయించింది. ఇందులో అర్బన్​కురూ.5‌‌‌‌‌‌‌‌00 కోట్లు, గ్రామీణ మిషన్​భగీరథ, నిర్వహణ కోసం రూ.400 కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో నడిచే పథకాలకు రూ.763 కోట్లు కేటాయించారు. 

వడ్డీ లేని రుణాల కింద రూ. 2,500 కోట్లు

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం బడ్జెట్​లో వడ్డీ లేని రుణాల కింద రూ.2,500 కోట్లు కేటాయించారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు వడ్డీ లేని రుణాల సబ్సిడీ కింద రూ.1,329 కోట్లు విడుదల చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టే మహిళా పారిశ్రామికవేత్తల రుణ వడ్డీ రాయితీ కోసం అదనంగా రూ.350 కోట్లు కేటాయించారు. ఉపాధి జాబ్ కార్డు ఉన్నవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి ఒకరికి రూ.12 వేలు చొప్పున అందిస్తున్నది.

ఈ స్కీమ్ కోసం రూ.600 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీలో మెటీరియల్ కాంపొనెంట్, అడ్మిన్ ఖర్చుల కింద సుమారు రూ.1,500 కోట్లకుపైగా వివిధ పద్దుల్లో కేటాయించింది. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కింద సుమారు రూ.267 కోట్లు కేటాయించింది.

కొత్తగా 2 లక్షల మందికి చేయూత

ఈసారి కొత్తగా 2 లక్షల మంది అర్హులకు చేయూత పింఛన్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం బడ్జెట్​లో  రూ.14,861 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42.67 లక్షల మందికి పింఛన్లు అందుతున్నది. వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ రోగులు, బోదకాలు బాధితులు, కళాకారులు ఇలా 11 కేటగిర్లీలో పింఛన్ అందిస్తున్నారు.

ఇందులో దివ్యాంగులకు రూ.4,016 ఇస్తుండగా మిగిలిన వారికి రూ.2,016 అందిస్తున్నారు. అయితే, పింఛన్​దారులు పలువురు చనిపోవడం, నకిలీ పింఛన్లు, బోగస్​ఏరివేత కారణంగా భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఇందులో కొన్ని రిప్లేస్ చేశారు. మిగిలినవి కూడా వాటి స్థానంలో భర్తీ చేయనున్నారు. అదనంగా కొత్తగా 2లక్షల వరకు అర్హులకు పింఛన్లు అందించాలని ప్రణాళికలు రూపొందించింది. కాగా, ప్రభుత్వం ప్రతి నెలా రూ.1,000.47 కోట్లు పింఛన్ దారులకు చెల్లిస్తున్నది