
హైదరాబాద్‌లో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని చర్లపల్లిలో 150 ఎకరాల్లో రైల్వే టెర్మినల్ నిర్మించాలని భావించామని, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వని కారణంగా 50 ఎకరాల రైల్వే ల్యాండ్‌లోనే టెర్మినల్ నిర్మిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం చర్లపల్లిలోని టెర్మినల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి రెండు నెలలకోసారి రైల్వే అధికారులతో రివ్యూ చేసి, పనులు వేగవంతం చేసేలా కృషి చేస్తానని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు త్వరగా అందేలా చూస్తానని కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సమావేశం నిర్వహించారు. రైల్వే సమస్యలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ సర్కార్ రూ.400 కోట్లు ఇవ్వకపోవడంతో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తన షేర్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ హయాంతో పోల్చుకుంటే రైల్వే ప్రాజెక్టులకు 7 రెట్లు ఎక్కువగా బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఒక్క తెలంగాణకే రూ.1,813 కోట్లు అదనంగా కేటాయించిందని చెప్పారు. కొన్ని ప్రాజెక్టులకు జనం నుంచి డిమాండ్ ఉన్నా.. కేంద్రం ముందుకు వస్తున్నా.. రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
కోచ్ ఫ్యాక్టరీపైచర్చించాం: నామా
విభజన చట్టంలో పేర్కొన్న కోచ్ ఫ్యాక్టరీ గురించి సమావేశంలో చర్చించామని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు చెప్పారు. రాష్ట్రానికి మంజూరైన కొత్త రైల్వే లైన్లు పూర్తి చేయాలన్నారు.
సర్కారు నిర్లక్ష్యంతో నిలిచిన పనులు: రేవంత్
సర్కారు నిర్లక్ష్యంతో చాలా రైల్వే పనులు ఆగిపో యాయని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. రూ.787 కోట్లతో పూర్తి చేయాల్సిన కృష్ణా, పరిగి, వికారాబాద్ రైల్వే లైన్.. ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఎంఎంటీఎస్ నిలిచిపోయాయన్నారు. గచ్చిబౌలి నుంచి మెట్రో రైల్ వేస్తే 25 వేల కోట్ల భారం పడుతుందని అన్నారు. సమావేశంలో ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రంజిత్ రెడ్డి, రాములు, రాజ్యసభ సభ్యులు కేకే తదితరులు పాల్గొన్నారు.
గెస్టులకు 2 కోట్ల గిఫ్టులా?
‘రాష్ట్రంలో ఈమధ్య జరిగిన ఓ సర్కారీ కార్యక్రమంలో అతిథులకు రూ. కోటి 80 లక్షల విలువైన వెండి గిఫ్టులిచ్చారు. ఇదేం సంప్రదాయం? వచ్చిన వారేమైనా విదేశీ అతిథులా? రాష్ట్ర సర్కారుకు ఆర్థిక క్రమశిక్షణే లేదు. సీఎం కేసీఆర్ నేల విడిచి సాము చేయడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని, ఆ ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై ఉందని కేసీఆర్ చెప్పడాన్ని తప్పుబట్టారు. దేశంలో ఆర్థిక మందగమనమే ఉందన్నారు. ప్రజల్లో ఓ రకమైన భయం సృష్టించేందుకు కేసీఆర్‌తో పాటు చాలా మంది ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.