డయాలసిస్ రోగులకు  కొత్త పింఛన్లు ఇయ్యట్లే !

డయాలసిస్ రోగులకు  కొత్త పింఛన్లు ఇయ్యట్లే !
  • అప్లికేషన్లు తీసుకోవడం లేదంటున్న బాధితులు
  •      మునుగోడు ఉప ఎన్నికలప్పుడు మంజూరు
  •     ఎలక్షన్లు అయిపోగానే వెబ్​సైట్ ​క్లోజ్​
  •     ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులు 
  •     టెస్టులు, మందులకే బోలెడెంత ఖర్చు

నల్గొండ, వెలుగు :  కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ ​చేసుకుంటున్న రోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వడం ఆపేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 103 గవర్నమెంట్​ సెంటర్లలో సుమారు 20 వేల మందికి పైగా రోగులకు డయాలసిస్​ జరుగుతోంది. గతంలో 83 సెంటర్లకే పరిమితమైన ఈ ఉచిత సేవలను ప్రభుత్వం 103 కేంద్రాలకు పెంచింది. జిల్లా కేంద్ర దవాఖానల నుంచి ఏరియా హాస్పిటల్స్​ వరకు విస్తరించింది. కానీ, ఆ మేరకు పేషెంట్లకు ఇస్తామని చెప్పిన ఆసరా పింఛన్లు మాత్రం ఇవ్వడం లేదు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గతేడాది జులైలో కొత్త పింఛన్లు మంజూరు చేసిన సర్కారు..ఎన్నికలు అయిపోగానే వెబ్​సైట్​ క్లోజ్ ​చేసేంది. అప్పటి నుంచి వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్లతో పాటు డయాలసిస్​ రోగుల పింఛన్ల దరఖాస్తులను కూడా తీసుకోవడం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ హె ల్త్​ స్కీంలో కొత్తగా అడ్మిట్​అయిన డయాలసిస్​ రోగులు పింఛన్ ​రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 20 వేల మంది డయాలసిస్​ పేషెంట్లు ఉండగా సుమారు 4 వేల మందికి పింఛన్​ రావడం లేదు.    

సర్వర్​ బంద్​

డయాలసిస్​ పేషెంట్లలో ఎక్కువగా వృద్ధులు, నడివయసు వారు, యువకులు ఉంటున్నారు. మిగతా వాళ్లతో సంబంధం లేకుండా డయాలసిస్​ పేషెంట్లను ప్రత్యేక కేటగిరీలో చేర్చామని సర్కార్ ​ప్రకటించినా, కనీసం పింఛన్ ​కూడా ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టమైనప్పుడు మాత్రమే వెబ్​సైట్​ ఓపెన్​ చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడే పింఛన్లు మంజూరు చేస్తూ మిగతా సమయాల్లో సర్వర్​ బంద్ ​చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పింఛన్ ​కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చనిపోయిన వాళ్ల స్థానంలోనూ కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు.     

ఆప్లికేషన్స్ ​కూడా తీసుకోవట్లే..

రాష్ట్రంలో కిడ్నీ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతూ ఉంది. సర్కారు దవాఖానల్లో నడిచే సెంటర్లలో ప్రతి నెలా వెయింటింగ్ లిస్ట్​10 నుంచి 20 మంది వరకు ఉండొచ్చని ఓ అంచనా. ఆరోగ్య శ్రీ ట్రస్ట్​ ద్వారా కిడ్నీ రోగులకు పింఛన్ మంజూరు చేస్తున్నారు. నెలకు రూ.2016, బస్​పాస్​ ఉచితంగా ఇస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హారీశ్​రావు ప్రకటించారు. కానీ, ఆయన ప్రకటించిన కొద్దిరోజుల వరకే వెబ్​సైట్​ పనిచేసింది. తర్వాత ఆరోగ్య శ్రీ ట్రస్ట్​ కొత్త ఆప్లికేషన్స్​ తీసుకోవడం ఆపేసింది. ప్రస్తుతం ఒక్కో సెంటర్​లో కనీసం 20 వరకు ఆప్లికేషన్స్ ​పెండింగ్​ లో ఉన్నాయని సమాచారం. 

చితికిపోతున్న కుటుంబాలు

రెండు కిడ్నీలు చెడిపోయి, తీవ్ర అనారోగ్యం పాలవుతున్న డయాలసిస్ ​రోగులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు గా ఉన్నవాళ్లే చాలా మంది పేషెంట్లు కావడంతో రోజు గడవడం కూడా కష్టంగా మారింది. పిల్లల చదువులు కూడా బంద్​చేయిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కిడ్నీ వ్యాధులు వస్తే  ఏ పరీక్షలు చేయించుకోవాలో, ఎక్కడ చికిత్స తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సర్కారు డయాలసిస్​ సెంటర్లలో ఇంజక్షన్లు, వెల్​నెస్ ​సెంటర్లలో మందులు ఇస్తోంది. ఇవి కూడా సక్రమంగా రావడం లేదు. తీసుకునేవారిలోనూ చాలామంది ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులు నాసిరకానికి చెందినవనే అపనమ్మకంతో వాడడం లేదు.  సర్కారు సెంటర్లలో ఇచ్చే మందులు సరిగ్గా పని చేయవని నిమ్స్, గాంధీ దవాఖానల్లోని డాక్టర్లే చెబుతున్నారని.. అందుకని బయటే కొంటున్నామని అంటున్నారు. మందులకు, ఇంజక్షన్లకు కలిపి నెలకు రూ.20వేల వరకు ఖర్చు పెడుతున్నామంటున్నారు. ఇంత ఖర్చు భరించలేని కుటుంబాలు కేవలం డయాలసిస్​తోనే సరిపెట్టుకుని దేవుడి మీద భారం వేస్తున్నాయి. ఆసరా పింఛన్​ ఇప్పిస్తే ఎంతో కొంత ఆసరా అవుతుందని వేడుకుంటున్నాయి. 

పింఛన్​ ఇవ్వట్లేదని చెప్తున్నరు 

మాది నల్గొండ, ఉప్పెర పని చేస్తుంటా. ఏడు నెలల నుంచి నల్గొండ గవర్నమెంట్​ దవాఖానలోని సెంటర్​లో డయాలసిస్​ చేయించుకుంటున్నా. నాకు ముగ్గురు పిల్లలు. కిడ్నీ జబ్బు వచ్చినప్పటికీ నుంచి పని మానేశా. నా భార్య కూలి పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. డబ్బులు లేక పదో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు చదువు మానేశారు. ఒక బాబు మాత్రమే స్కూల్​కు పోతుండు. రేషన్​ బియ్యంతోనే ఇల్లు గడుస్తోంది. మందులు కొనేందుకు కూడా డబ్బుల్లేవు. ఇల్లు గడవడం ఇబ్బందిగా మారింది. పింఛన్​కోసం పోతే దరఖాస్తులు తీసుకోవడం లేదని చెప్పారు.  
– వేముల రవి, నల్గొండ

సర్వర్​ ఓపెన్​ కావట్లేదంటున్నరు

నేను చౌటుప్పుల్​ సెంటర్​లో డయాలసిస్​ చేయించుకుంటున్నా. మందులకు నెలకు రూ.14వేల దాకా ఖర్చువుతోంది. పెన్షన్ కి అప్లై చేసుకుంటే సర్వర్ ఓపెన్ కావట్లేదని అధికారులు చెబుతున్నారు. నాలుగు నెలలుగా పెన్షన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా. 
– బాలగోని నగేశ్, చౌటుప్పల్