ఆర్ అండ్ బీకి మేడారం మాస్టర్ ప్లాన్ పనులు..

ఆర్ అండ్ బీకి మేడారం మాస్టర్ ప్లాన్ పనులు..
  •     దేవాదాయ శాఖ నుంచి ఫైల్స్ పంపించాలని సీఎస్ ఆదేశం
  •     చర్చనీయాంశంగా శాఖల మధ్య బదిలీ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: మేడారం మాస్టర్ ప్లాన్ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. ఈ వర్క్స్ కు సంబంధించిన పనుల పర్యవేక్షణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అన్నీ ఫైల్స్​ను తక్షణమే ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించాలని సీఎస్​ రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. మేడారం సమ్మక–సారక్క క్షేత్రం అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అమ్మవారి గద్దెలు, ప్రాకారం మర్చాలని నిర్ణయం తీసుకున్నది. మేడారం జాతరలో ప్రధాన భాగమైన తల్లుల గద్దెల ఏరియా రూపురేఖలు మార్చనున్నది. 

పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గద్దెల ఏరియాను విశాలంగా తీర్చిదిద్ద బోతున్నది. గద్దెల చుట్టూ ఇప్పటి వరకు ఉన్న నాలుగు గేట్లకు అదనంగా మరో నాలుగు గేట్లు పెంచి మొత్తం ఎనిమిది ద్వారాలు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఎనిమిది గేట్లకు పూజారుల వంశాల చరిత్రను ప్రతిబింబించేలా ఆర్చిలు నిర్మించనున్నారు. మాస్టర్ ప్లాన్​ పనుల కోసం దేవాదాయ శాఖ తరఫున రూ.101 కోట్లు రిలీజ్ చేశారు. 

అయితే ఈ పనులకోసం దేవాదాయ శాఖ తరఫున టెండర్లు ఆహ్వానించారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు టెండర్లు ఆహ్వానించారు. ఈ పనుల బాధ్యత దేవాదాయ శాఖదే అయినప్పటికీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పనులు చేసే బాధ్యతను ఆర్ అండ్​బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు సంబంధించిన రికార్డులను వెంటనే అప్పగించాలని దేవదాయ శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు.