
- రెండున్నరేండ్లలో 40 శాతం బిల్లులు చెల్లింపు
- మిగిలిన 60 శాతం బిల్లుల చెల్లింపునకు15 ఏండ్ల గడువు
- అంతకాలం వెయిట్ చేయలేమంటున్న కాంట్రాక్టర్లు
- టెండర్లపై కొనసాగుతున్న సందిగ్ధత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లలను దశలవారీగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 96 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న13 వేల కిలోమీటర్ల ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లను డెవలప్ చేయాలని నిర్ణయించింది. కర్నాటకలో సక్సెస్ అయిన ఈ ఫార్ములాను రాష్ట్రంలోనూ అనుసరించాలని భావించినా అడుగు ముందుకు పడట్లేదు.
జీవో జారీ చేసి రెండు నెలలు దాటినా ఇంకా చర్చల దశలోనే ఉంది. బిల్లుల చెల్లింపు విషయంలో సర్కారు విధించే కొత్త నిబంధనలు తమకు ఇబ్బందిగా మారాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. రెండున్నరేళ్లలో పనులు పూర్తిచేసే సరికి కేవలం 40 శాతం నిధులు చెల్లించి మిగతా 60 శాతం బిల్లుల కోసం 15 ఏళ్ల పాటు ఎదురుచూడడం తమ వల్ల కాదని మొండికేస్తున్నారు. దీంతో హ్యామ్‌రోడ్ల పై సందిగ్ధత అలాగే కొనసాగుతోంది.
రాష్ట్రంలో సుమారు రూ.12 వేల కోట్లతో ఆర్అండ్ బీ శాఖ పరిధిలో 5,190 కి.మీ, పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని 7,947 కి.మీ రోడ్లను బాగు చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 20న జీఓ జారీ చేసింది. బిల్లుల చెల్లింపు ఎలా చేయనున్నారో అందులో వివరించింది. ఈ జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2,254 పంచాయతీ రాజ్ పనులు, 373 ఆర్అండ్ బీ పనులను ప్యాకేజీల వారీగా చేపట్టాలని నిర్ణయించారు.
30 నెలల కాలవ్యవధిలో 10 శాతం నిధులు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద చెల్లించి, మిగతా 30 శాతం నిధులను పనులు కంప్లీట్ అయ్యేలోగా చెల్లిస్తారు. రోడ్ల నిర్వహణ కాలం 15 సంవత్సరాలుగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆఫీసర్లు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆ జీవోలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో మిగిలిన ఆర్అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లను విడతలవారీగా బాగుచేస్తామని వెల్లడించారు.
కాంట్రాక్టర్ల అభ్యంతరాలు ఇవీ..
హ్యామ్ విధానంలో చేపట్టబోయే రోడ్లకు సంబంధించి ఇటీవల ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పనులు పూర్తయ్యేలోగా 40 శాతం బిల్లులను సర్కారు చెల్లిస్తే మిగిలిన 60 శాతం నిధుల్లో 20 శాతం కాంట్రాక్టర్ సమకూర్చుకోవాలని, మిగతా 40 శాతం బ్యాంక్ లోన్లు తీసుకోవాలని, ఈ నిధులను 15 ఏళ్ల కాలపరిమితిలో విడతలవారీగా సర్కారు చెల్లిస్తుందని చెప్పడంపైనే కాంట్రాక్టర్లు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం.
తొలి దశలో 13 వేల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తే అందులో రూ.7 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉండడం తమకు అంగీకారం కాదని చెప్పినట్లు తెలిసింది. కర్నాటకలో ఇదే విధానం అనుసరించినప్పటికీ అక్కడ 15 ఏండ్ల పాటు టోల్ వసూలుకు అవకాశమిచ్చారని, కానీ.. ఇక్కడ ఆ పరిస్థితి లేనందునవల్ల తమ సంస్థలు దివాలా తీస్తాయని కొందరు కాంట్రాక్టర్లు పేర్కొన్నట్లు తెలిసింది. వీటితోపాటు టెండర్ దశలో ఉన్న పనులకు సంబంధించి కన్సల్టెంట్లు సిద్ధం చేసిన డీపీఆర్ లలో తప్పులు ఉన్నట్లు చెబుతున్నారు. సర్వే సమయంలో కన్సల్టెంట్లు ఫీల్డ్ ఆఫీసర్లతో కలిసి వెళ్లలేదని, వారి సూచనలు పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నట్లు తెలిసింది.
రెండు నెలలుగా చర్చల దశలోనే
కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని భావించిన హ్యామ్ రోడ్ల పరిస్థితి గత రెండు నెలలుగా అడుగులు ముందుకు పడడం లేదు. ఈ పనులకు సంబంధించిన నిధుల సమీకరణపై బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించినా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో సర్కారుకు ప్రాథమిక నివేదిక సైతం ఇవ్వలేకపోయామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. దీంతో తొలిదశలో చేపట్టబోయే 13 వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లపై సందిగ్ధత నెలకొన్నది.