దళితబంధు -2కు సర్కార్​ పర్మిషన్

దళితబంధు -2కు సర్కార్​ పర్మిషన్
  • ఎమ్మెల్యేలతో చర్చించి లబ్ధిదారులను ఎంపిక చేసేలా కలెక్టర్లకు బాధ్యత
  • నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున 1,29,800 మందికి అమలు
  • హుజూరాబాద్​ మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ పథకం    

హైదరాబాద్, వెలుగు:  రెండో దశ దళితబంధు పథకం అమలుకు పర్మిషన్​ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన కేబినెట్​ తీర్మానానికి తగ్గట్టుగా 1.3 లక్షల మందికి పథకాన్ని అమలు చేయాలని జీవోలో పేర్కొంది. నియోజకవర్గానికి 1,100 మందికి చొప్పున 118 నియోజకవర్గాల్లో 1,29,800 మందికి దళితబంధు–2ను అమలు చేస్తామని పేర్కొంది. మరో 200 మంది లబ్ధిదారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక చేయనున్నారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికలప్పుడు ఆ నియోజకవర్గాన్ని పైలెట్​ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున దాన్ని ఇప్పుడు పథకం నుంచి మినహాయించారు. ఎమ్మెల్యేలతో చర్చించి నియోజకవర్గానికి 1,100 మంది లబ్ధిదారులను కలెక్టర్లు ఎంపిక చేయాలని జీవోలో సర్కారు పేర్కొంది. 

లబ్ధిదారులను గుర్తించి.. వారిని స్క్రూటినీ చేసిన తర్వాత లబ్ధిదారుల వివరాలను డేటాబేస్​ వెబ్​ పోర్టల్​లో ఎంపీడీవోలు, ఇతర అధికారులతో అప్​లోడ్​ చేయించాలని సూచించింది. ఆ పోర్టల్​లోని వివరాల ఆధారంగానే లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్​ చేయాలని తెలిపింది. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లు వెంటనే స్టార్ట్​ చేయాలని ప్రభుత్వం సూచించింది. 2021 హుజూరాబాద్​ ఉప ఎన్నిక టైంలో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. దాదాపు రూ. 2,000 కోట్లు ఆ పథకం కోసం కేటాయించారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 38,496 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అమలు చేశారు. ఏడాది నుంచి మళ్లీ దాని ఊసే లేదు. గతేడాది దళితబంధుకు రూ.17,700 కోట్లు కేటాయించిన సర్కారు.. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 

నియోజకవర్గానికి 500 మందికి కూడా ఇచ్చేది కష్టమే! 

దళిత బంధు స్కీమ్​ను రాష్ట్ర ప్రభుత్వం ఏడాది నుంచి పట్టించుకోలేదు. అయితే ఇటీవల కొత్త సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గానికి 1,100 మందికి దళిత బంధు అమలు ఫైల్​పై సీఎం కేసీఆర్​ సంతకం చేశారు. ఇది జరిగి రెండు నెలలు కావొస్తున్నది. ఇప్పుడు జీవో  కూడా 1,100 మందికి అని జారీ చేశారు. అయితే నిధులు మాత్రం ఎన్నిస్తారనే దానిపై గందరగోళం నెలకొన్నది.  ఎన్నికల ఏడాది కావడంతో ముఖ్యమైన స్కీమ్​లకు ఎంతో కొంత నిధులు ఇవ్వాలని.. వాటితోనే ఎన్నికలు ముగిసే వరకు హడావుడి చేయాలని అధికార యంత్రాంగానికి  సర్కార్ నిర్దేశించినట్టు తెలుస్తున్నది. నిధుల సర్దుబాటులో భాగంగా దళితబంధు కు రూ. 5 వేల కోట్ల లోపు మాత్రమే ఇవ్వాలని ఫైనల్​ చేసినట్లు తెలిసింది. ఇందులోనూ ముందుగా రూ. 2 వేల కోట్లు మాత్రమే ఇవ్వనున్నారు. ఎన్నికలలోపు నియోజకవర్గానికి 300 నుంచి 500 మందికే స్కీమ్​ అందుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.