
న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ ఆఫీసు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ నామినేషన్లను తిరసరిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. జులై 29న గవర్నర్ ఆఫీసు తరఫు అడ్వకేట్ డి.మహేశ్ బాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దాసోజు శ్రవణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కోదండరాం, అమిర్ అలీఖాన్ లను రెస్పాండెంట్ గా పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌కు సిఫారసు చేసింది. ప్రభుత్వం సిఫారసు చేసిన ఆ ఇద్దరు నేతలకు రాజకీయ నేపథ్యం ఉందంటూ నాటి గవర్నర్ తమిళిసై ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. దీంతో వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఈ స్థానాలకు కోదండరాం, ఆమిర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ కు సిఫారసు చేసింది. గవర్నర్ ఆమోదించడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. కానీ దాసోజు, కుర్రా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు సీజే బెంచ్.. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ నామినేషన్లను తిరస్కరిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
అలాగే.. కొత్తగా ఎమ్మెల్సీగా కోదండరాం, అలీఖాన్లను నియమించాలనే తీర్మానంతోపాటు వాళ్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో ఇద్దరు గవర్నర్లు తమిళసై, రాధాకృష్ణన్ మారగా, కొత్త గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ వచ్చారు.