రాష్ట్రం వచ్చిన ఎనిమిదేండ్లకు అధికారికంగా ఉత్సవాలు

రాష్ట్రం వచ్చిన ఎనిమిదేండ్లకు అధికారికంగా ఉత్సవాలు
  • కేంద్రం ప్రకటించిన మరుసటి రోజే రాష్ట్ర కేబినెట్​లో తీర్మానం
  • ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ పేరిట ఏడాదంతా సంబురాలు
  • ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు
  • 17న ఎన్టీఆర్​ స్టేడియంలో బహిరంగ సభ.. హాజరుకానున్న సీఎం

హైదరాబాద్‌‌, వెలుగు: అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లకు సెప్టెంబర్​ 17 ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర కేబినెట్​ సమావేశంలో తీర్మానం చేశారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా కేంద్రం ఏడాది పొడవునా ‘హైదరాబాద్‌‌ సంస్థానం పరిధిలో సెప్టెంబర్​ 17 విమోచన వేడుకలు’ నిర్వహించనున్నట్లు ప్రకటించిన మరుసటి రోజునే కేసీఆర్‌‌ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఏర్పడి, తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్​ చెప్పారు. పవర్‌‌లోకి వచ్చిన తర్వాత ఆ మాటే మరిచిపోయారు. సెప్టెంబర్‌‌ 17 విమోచన దినం కాదని, విలీన దినమంటూ చెప్తూ వచ్చారు. విమోచన దినోత్సవంపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. జూన్‌‌ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైనప్పుడు సెప్టెంబర్‌‌ 17ను ఎందుకు అధికారికంగా నిర్వహించాలని ఎదురుదాడికి దిగారు. అలాంటి కేసీఆర్‌‌ ఇప్పుడు గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా సెప్టెంబర్‌‌ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభదినం’గా పాటించనున్నట్టు ప్రకటించారు. ఏడాది పాటు వేడుకలతో  పాటు ప్రారంభ, ముగింపు ఉత్సవాలను మూడేసి రోజులు నిర్వహిస్తామని తెలిపారు. 

అట్టహాసంగా కార్యక్రమాలు

తెలంగాణ(హైదరాబాద్‌‌ సంస్థానం) రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి మారి ఈ ఏడాది సెప్టెంబర్‌‌ 17తో 75 ఏండ్లు అవుతున్నందున ఆ రోజును ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ మూడు రోజుల పాటు ప్రారంభ వేడుకలను నిర్వహించాలని శనివారం ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన జరిగిన కేబినెట్​లో తీర్మానం చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌‌లో నిర్వహించిన టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీ భేటీలోనూ ఇదే విషయంపై ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం, పార్టీ పరంగా తెలంగాణ వజ్రోత్సవాలు అట్టహాసంగా నిర్వహించాలని వారికి పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌‌ 16న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువత, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలన్నారు. 

కేసీఆర్‌‌‌‌ సర్కార్​ దిగొచ్చింది

17న కేసీఆర్ పబ్లిక్ గార్డెన్‌‌‌‌లో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడుతారు. అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు , మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండా ఎగురవేస్తారు. అదేరోజు మధ్యాహ్నం హైదరాబాద్​లో  బంజారా భవన్‌‌‌‌, ఆదివాసీ భవన్‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌ ప్రారంభిస్తారు. నెక్లెస్‌‌‌‌ రోడ్డులోని పీపుల్స్‌‌‌‌ ప్లాజా నుంచి ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌ వద్ద గల అంబేద్కర్‌‌‌‌ విగ్రహం మీదుగా ఎన్టీఆర్‌‌‌‌ స్టేడియం దాకా గుస్సాడీ, గోండు, లంబాడీ కళారూపాలతో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఎన్టీఆర్‌‌‌‌ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్‌‌‌‌ పాల్గొని మాట్లాడుతారు. 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మానాలు చేస్తామన్నారు. వజ్రోత్సవ ముగింపు వేడుకలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌‌‌‌ 16 నుంచి 18 దాకా నిర్వహించనున్నారు.