గ్రూప్ 1, 2 రిక్రూట్‌‌మెంట్‌‌లో మార్పులు?

గ్రూప్ 1, 2 రిక్రూట్‌‌మెంట్‌‌లో మార్పులు?

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1, 2 రిక్రూట్‌‌మెంట్‌‌లో మార్పులు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో సర్కారు ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సారి జరిగే గ్రూప్1, 2 రిక్రూట్‌‌మెంట్‌‌ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైందని అంటున్నారు. గ్రూప్స్‌‌ రిక్రూట్‌‌మెంట్లలో ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్వ్యూలు తీసేయాలని సర్కార్​ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌‌‌‌ వద్ద అనుమతి తీసుకోవాలని​ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.

లేట్ కాకూడదని..

రాష్ట్రంలో 80,039 పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో కీలకమైన గ్రూప్ 1 పోస్టులు 503, గ్రూప్​ 2లో 582 పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. 
దీంతో టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రాసెస్ ప్రారంభించింది. 19 డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల నుంచి పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను సేకరించే పనిలో పడింది. ఈ క్రమంలోనే రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌నూ మారిస్తే బెటర్ అనే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం గ్రూప్ 1లో ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించి తర్వాత ఇంటర్వ్యూలు జరిపి సెలెక్ట్ చేస్తారు. గ్రూప్ 2లో మాత్రం ఒకే పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అయితే ఇంటర్వ్యూల నిర్వహణ నెలల తరబడి ఉండటంతో పోస్టుల భర్తీ ఆలస్యమవుతోంది. మరోపక్క దీన్ని ఎంతబాగా నిర్వహించినా, ఏవో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చే అవకాశం ఉందనే భావన సర్కారు పెద్దలు, కమిషన్ అధికారుల్లో ఉంది. దీంతో ఇంటర్వ్యూలను తీసేస్తేనే బెటర్ అని భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే గ్రూప్1 రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఇంటర్వ్యూల విధానం తీసేశారు. ఇదే విషయాన్ని సీఎంకు చెప్పి, ఇక్కడా తీసేయాలనే భావనలో ఉన్నారు.