- రెండు సెంటర్లు శాశ్వతంగా, మరో పది తాత్కాలిక మూసివేత
హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 12 ఫెర్టిలిటీ సెంటర్లపై రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ చర్యలు చేపట్టింది. షోకాజ్ నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రెండు సెంటర్లను పర్మినెంట్ గా మూసివేస్తూ, మరో 10 సెంటర్లను కొద్దిరోజుల పాటు సేవలు నిలిపివేయాలని మంగళవారం కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో భాగంగా.. ఒక డాక్టర్ పేరుతో సెంటర్కు అనుమతి పొంది, ఆ డాక్టర్ లేకుండానే వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. కీలక నిపుణులు లేకుండానే సెంటర్లు నడుపుతున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. గర్భిణులకు చేసే స్కానింగ్ వివరాలను ప్రభుత్వానికి తెలపకపోవడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. వారి వివరణ సంతృప్తి కరంగా లేకపోవడంతో చర్యలు తీసుకున్నారు.
