న్యాయవాదులపై దాడులను అరికట్టాలె

న్యాయవాదులపై దాడులను అరికట్టాలె

హైదరాబాద్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో జరిగిన న్యాయవాది ములగుండ్ల మల్లారెడ్డి హత్యను నిరసిస్తూ రాష్టవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేశారు. హైదరాబాద్ పాతబస్తీ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ న్యాయవాదులు  ప్లకార్డులు చేతబూని రోడ్లమీదకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ... మల్లారెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిందితులును అరెస్ట్ చేసి... ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులకు త్వరగా శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను శిక్షించాలని కోరారు. 

రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరిగాయన్న వారు... ఇప్పటి వరకు 70 మందికి పైగా న్యాయవాదులపై దాడులు జరిగాయని తెలిపారు. ఎలాంటి ప్రాణహాని లేని వాళ్లకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్న ప్రభుత్వం... ప్రాణాలను కూడా లెక్క చేయకుండా  నిత్యం  ప్రజల కోసం పాటపడుతోన్న న్యాయవాదులకు ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వడంలేదని ప్రశ్నించారు. న్యాయవాదులకు పోలీస్ రక్షణ కల్పించాలన్న వారు... అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.